Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: కడపలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టుకు మనస్తాపంతో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఈరోజు కడపలో చెండ్రాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని నారా భువనేశ్వరి తెలిపారు. వైసీపీ చేసే ప్రతి తప్పును చంద్రబాబుపై నెట్టేస్తున్నారని భువనేశ్వరి మండిపడ్డారు. పింఛన్ల విషయాన్ని కుట్రపూరితంగా చంద్రబాబుకు ఆపాదిస్తున్నారని, వైసీపీ రాక్షస పాలనలో చంపడం, హింసించడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వృద్ధులను మంచాలపై తీసుకెళ్తూ వారిని ఇబ్బందిపెడుతున్నారని మండిపడ్డారు.
ప్రొద్దుటూరులోని పెద్దశెట్టిపల్లెలో టీడీపీ కార్యకర్త కూరపాటి రాధా కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. టీడీపీ కోసం వేలమంది కార్యకర్తలు త్యాగం చేశారని భువనేశ్వరి తెలిపారు. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, మాచర్లలో చంద్రయ్యలను వైసీపీ నాయకులు దారుణంగా హత్య చేశారన్నారు. టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకెళ్లి పోరాడాలని, చంద్రబాబు అండగా ఉంటారని స్పష్టం చేశారు.
చంద్రబాబు సీఎం అయ్యాక మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు: భువనేశ్వరి - Bhuvaneshwari Nijam Gelavali Yatra
రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు (Chandrababu Naidu) రేయింబళ్లు ఏ విధంగా కష్టపడే వారో ప్రజలు అందరికీ తెలుసని భువనేశ్వరి అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో హత్యలు, దాడులు, హింస పెరిగిపోవడంతో పాటు, గంజాయి, డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా చలామణి అవుతోందని ఆరోపించారు. ఈ రాక్షస రాజ్యం పోవాలంటే మళ్లీ చంద్రబాబును గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల రణక్షేత్రంలో చంద్రబాబు సైనికుడిలా ముందుంటారని, మీరందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
‘నిజం గెలవాలి’ యాత్రలో (Nijam Gelavali Yatra) భాగంగా నారా భువనేశ్వరి కడప, ప్రొద్దుటూరులలో నేడు పర్యటిస్తున్నారు. నేటి ఉదయం కడప విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరికి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కడప విమానాశ్రయం నుంచి కార్యకర్త కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లారు. నేడు కడప, ప్రొద్దుటూరు, డోన్, పాణ్యం నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన సాగనుంది. ప్రొద్దుటూరులో పెద్దశెట్టిపల్లిలోని బాధిత కుటుంబాన్ని నేడు భువనేశ్వరి పరామర్శించారు. అదే విధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి వరదరాజులరెడ్డి నివాసం వద్ద మహిళలతో భేటీ అవుతారు. అనంతరం నంద్యాల జిల్లా పర్యటనకు బయలుదేరి వెళతారు.