Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra in Nandyal District : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జిల్లా పర్యటన కొనసాగుతోంది. మండుటెండను కూడా లెక్క చేయకుండా భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు. నారా చంద్రబాబు అరెస్ట్‌తో పలువురు ఆ పార్టీ అభిమానులు గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంతో బాధితులను పరామర్శించటానికి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పరామర్శ యాత్ర నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు సీఎం అయ్యాక మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు: భువనేశ్వరి
ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నంద్యాల చేరుకున్న నారా భువనేశ్వరికి నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్, పార్లమెంటు అభ్యర్ధి శబరి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. తరువాత నంద్యాలలో 34 వార్డులో అబ్దుల్ రహీం, 13 వార్డులో గురవరాజు, మహనంది మండలం బుక్కాపురంలో చిన్న మద్దిలేటి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందించారు. అలాగే ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ప్రతి ఒక్కరికి ఓటే ఆయుధం : అనంతరం ప్రజలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా రాక్షస పాలన జరుగుతుందన్నారు. ఈ రాక్షసుడిని ఇంటికి సాగనంపాలని తెలిపారు. మీ ఓటుతోనే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి ఒక్కరికి ఓటే ఆయుధమన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సైకిల్ ఎక్కి అన్యాయం చేసేవారిని తొక్కుకుంటూ పోవాలని పిలుపునిచ్చారు. కూటమిలో జెండాలు వేరైనా ప్రజా పాలనకు ఒకటే ఎజెండా అని తెలిపారు.
ప్రజల కష్టాలు తీర్చేది టీడీపీ- ప్రజల్ని కష్టాల్లోకి నెట్టేది వైఎస్సార్సీపీ : నారా భువనేశ్వరి
అలాగే వృద్ధులకు, వికలాంగులకు ఇవ్వాల్సిన పింఛన్‌ను వారి ఇంటి దగ్గరే ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. దీనిపై కావాలనే టీడీపీపై బురద జల్లుతూ అవ్వతాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేెశారు. అందుకే ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టి జాగ్రాత్తగా ఓటు వేయ్యాలని సూచించారు. రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు రేయింబవళ్లు ఏ విధంగా కష్టపడే వారో ప్రజలు అందరికీ తెలుసన్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో హత్యలు, దాడులు, హింస పెరిగిపోవడంతో పాటు, గంజాయి, డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా చలామణి అవుతోందని విమర్శించారు.
కొద్ది రోజుల్లోనే ప్రజల ప్రభుత్వం వస్తుంది : ఈ రాక్షస రాజ్యం పోవాలంటే మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. ఈ ఎన్నికల రణక్షేత్రంలో చంద్రబాబు సైనికుడిలా ముందుంటారని, మీరందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక కొద్ది రోజుల్లోనే ప్రజల ప్రభుత్వం అధికారంలోకని వస్తుంది భరోసా ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ జెండాలు వేరైనా ఎజెండా మాత్రం ఒక్కటే అన్నారు. కాబట్టి అందరినీ భారీ మోజార్టీతో గెలిపించాలి భువనేశ్వరి ప్రజలను కోరారు.
'రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలంతా చేయిచేయి కలిపి మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలి'