NTR Birth Anniversary in Telangana 2024 : ఎన్టీఆర్ ఆ పేరు తలవగానే తెలుగు నేల పులకిస్తుంది. ప్రజాసేవలో ఆయన ప్రతి అడుగూ, సమాజశ్రేయస్సు కోసం చేపట్టిన ప్రతిసంస్కరణ నేటి తరానికి మార్గదర్శకమై నిలుస్తుంది. సినీ వినీలాకాశంలో ధ్రువతారగా, రాజకీయ యవనికపై విజయానికి చిరునామాగా మారిన నందమూరి తారక రామారావు ప్రయాణంలో ప్రతి అడుగూ ఓ సంచలనం. తెలుగువారంతా నోరారా అన్నా అని పిలుచుకునే ఆయన 101వ జయంతి నేడు.
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతిని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, అంజలి ఘటించారు. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి, తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవమని బాలకృష్ణ అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ తొలుత చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు : ఆ తర్వాత ఎన్టీఆర్ చిత్రరంగంలోకి వచ్చారని, ఆయన అంటే నటనకు విశ్వవిద్యాలయమని బాలకృష్ణ తెలిపారు. సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. ఒకే పంథాలో వెళ్తున్న పాలిటిక్స్‌ను మార్చారని గుర్తు చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని వివరించారు.
"అంతకుముందు రాజకీయాలంటే కొంతమందికే పరిమితమై ఉండేవి. కానీ ఎన్టీఆర్ వచ్చాక డాక్టర్లు, లాయర్లు, అభిమానులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీనవర్గాలకు పదవులు కట్టబెట్టారు. ప్రభుత్వంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు." - బాలకృష్ణ, ఎన్టీఆర్ తనయుడు
Tarak Tribute to NTR : అంతకుముందు మనువళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పూలమాల వేసి అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు. అదేవిధంగా కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక పేరు, ఒక వ్యక్తి కాదు, ఒక సంచలనమని పురందేశ్వరి అన్నారు. చిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా నటించారని, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నారని తెలిపారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు తెచ్చారని ఆమె గుర్తు చేశారు.
Venkaiah Naidu Tribute to NTR : తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకైన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. చలన చిత్ర రంగంలో పురాణ పురుషుల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి, అశేష ప్రజానీకాన్ని మెప్పించారని కొనియాడారు. ఇంటింటి ఇలవేల్పుగా నీరాజనాలు అందుకున్న ఆయన రాజకీయాల్లోనూ నవశకానికి నాంది పలికారని గుర్తు చేశారు. దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారని వెంకయ్యనాయుడు ప్రశంసించారు.
గొప్ప జాతీయ వాది అయిన ఎన్టీఆర్ నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచి, దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు అంకురార్పణ చేసి, మార్గదర్శిగా నిలిచి మహానేతగా మన్ననలు అందుకున్నారని వెంకయ్యనాయుడు అన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, అధికార వికేంద్రీకరణ సహా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన గొప్ప సంస్కరణవాది నందమూరి తారక రామారావు అని వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఈ రికార్డ్ ఎన్టీఆర్‌కే సాధ్యం? - అంతమంది దర్శకులతో పనిచేశారా? - NTR 101 Birth Anniversary
NTR Birthday : కారణజన్ముడు.. తారకరాముడు.. ఆయనకు మాత్రమే సాధ్యమైన ఘనతిది!