Borugadda Anil Arrested : వైఎస్సార్సీపీ హయాంలో రెచ్చిపోయి ప్రతిపక్ష నేతలను ఇష్టానుసారం దూషించిన బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గుంటూరు నగరంలో విద్యాసంస్థలకు చెందిన కర్లపూడి బాబూ ప్రకాశ్‌ను రూ.లక్షల్లో డిమాండ్ చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్హాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని నల్లపాడు పీఎస్‌లో రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకునేవాడు. తన అనుయాయులతో కలిసి రోడ్లపై నానా హంగామా సృష్టించేవాడు. ప్రతిపక్షాలపై ఇష్టారీతిన దూషణలకు దిగాడు. అనిల్‌పై గతంలో పట్టాభిపురం, అరండల్‌పేట సహా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఫోన్ చేసి జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని బెదిరింపులకు గురిచేశాడు.
గుంటూరు జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై బోరుగడ్డ అనిల్ చేయి చేసకోవడం అప్పట్లో సంచలనమైంది. తన నివాసం వైపు నుంచి వెళ్లే స్థానికులను కూడా అటకాయించి దౌర్జన్యానికి పాల్పడేవాడు. అతడికి వైఎస్సార్సీపీ పెద్దలతో సంబంధాలు ఉండడంతో పోలీసులు కూడా కేసు నమోదుకు వెనకాడారనే అభిప్రాయం ఉంది. ఇలా అడుగడుగునా అనిల్ విషయంలో పోలీసులు చూసీచూడనట్లుగా ఉండిపోయారనే విమర్శలు ఉన్నాయి.
ఐఏఎస్‌లకు దక్కని ఊరట - పిటిషన్ డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు