ANU Hostel Food Issue: గుంటూరు జిల్లా ఏఎన్‌యూలో (Acharya Nagarjuna University) విద్యార్థినుల ఆందోళనపై నిజాలు తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ నియమించింది. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్రారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కోమలితో నియమించిన కమిటీ విశ్వవిద్యాలయంలో పర్యటించింది. కమిటీ సభ్యులు ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
వసతి గృహంలోని మెస్‌లో విద్యార్థినులతో చర్చించారు. సిబ్బంది అశ్రద్ధ వల్లే విద్యార్థినులకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారని ప్రాథమికంగా గుర్తించామని విచారణ అధికారిణి సంజనా సిన్హా చెప్పారు. ఆదివారం మరోసారి కేవలం విద్యార్థినిలతో చర్చించిన తర్వాత సోమవారం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశామని వీసీ గంగాధర్ చెప్పారు. చీఫ్ కుక్, సహాయ కుక్‌లను సస్పెండ్ చేశామన్నారు.
బయట నుంచి ఆహారం తెచ్చుకునేందుకే ఆందోళన: అదే విధంగా బయటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకే విద్యార్థినిలు ఆందోళన చేశారని వీసీ గంగాధర్ అన్నారు. ఆహారంలో పురుగులు, కప్ప వచ్చినట్లు ఆధారాలులేవని అంటూ ఒకసారి, కేవలం పురుగులు మాత్రమే వచ్చాయని మరోసారి మాట మార్చారు. శుక్రవారం విద్యార్థినిల ఆందోళనపై తమకు అనుమానాలున్నాయని చెప్పారు.
భోజనంలో ఉదయం కప్ప, రాత్రి పురుగులు - ఇదేమి మెను కాదు !
ఆహారంలో పురుగులపై అధికారుల దిద్దుబాటు చర్యలు: కాగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆహార నాణ్యత లోపించడంతో శుక్రవారం రాత్రి విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు నాగార్జున విశ్వవిద్యాలయంలో తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ రామ్మోహనరావు, కార్యదర్శి భరత్ గుప్తా, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసులు వసతి గృహంలోని మెస్‌ను వర్సిటీ వీసీ గంగాధర్, రిజిస్ట్రార్ సింహాచలంతో కలిసి పరిశీలించారు.
విద్యార్థులతో అధికారులు చర్చించారు. మెస్ పరిసరాలను పరిశీలించిన అధికారులు అంతా అపరిశుభ్రంగా ఉందని గుర్తించారు. తాగునీటి ట్యాంకులో తల వెంట్రుకలు, మలినాలు ఉండటాన్ని గుర్తించిన అధికారులు, సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత నిర్లక్ష్యంగా ఉద్యోగాలు చేస్తుంటే మీరేం చేస్తున్నారని వార్డెన్‌ను ప్రశ్నించారు.
వాటర్ ట్యాంక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా హాస్టల్ వార్డెన్, మెస్ ఇన్‌ఛార్జితో ఉన్నత విద్యామండలి అధికారులు మాట్లాడారు. మరోవైపు నాగార్జున వర్సిటీలో ఆహారంలో పురుగులపై అధికారుల దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రిజిస్ట్రార్ సింహాచలం ఇవాళ ఉదయం అల్పాహారం దగ్గరుండి చేయించారు.
అన్నంలో మట్టి, పురుగులు - నన్నయ వర్సిటీలో విద్యార్థుల ఆకలి కేకలు