Nagarjuna Sagar to Srisailam Boat Tour : లాహిరి, లాహిరి, లాహిరిలో అంటూ పలువురు పర్యాటకులు, భక్తులు లాంచీలో ప్రయాణిస్తూ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం శ్రీశైలానికి లాంచీ ప్రారంభమైంది. నాగార్జునసాగర్ నుంచి 80 మంది ప్రయాణికులతో ఉదయం 10:30 గంటలకి లాంచీ కదిలింది.
నల్లమల అందాలను తిలకిస్తూ : ఏకధాటిగా ఆరు గంటల పాటు కృష్ణానదిలో ప్రయాణించి సాయంత్రం 4:30 గంటలకు పాతాళగంగకు చేరుకుంది. ప్రయాణికులు లాంచీలో నల్లమల అందాలను తిలకిస్తూ సంతోషంగా ప్రయాణం చేశారు. పర్యాటకులు, భక్తులు మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత ఈరోజు లాంచీ నాగార్జునసాగర్‌కు తిరిగి వెళ్తుందని అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి రానుపోను పెద్దలకు రూ.3,0000లు, పిల్లలకు రూ.2,400 వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వచ్చేందుకు మాత్రమే అయితే పెద్దలకు రూ.2,000లు, పిల్లలకు రూ.1,600 వసూలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
చాలా ఆనందంగా ఉంది : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రారంభిస్తున్నట్లు వార్తల్లో చూశామని హైదరాబాద్‌కి చెందిన జ్యోతి తెలిపారు. వెంటనే తమ కుటుంబ సభ్యులతో కలిసి లాంచీలో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అందుకు ముందుగానే తమ పేర్లను నమోదు చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌కు వెళ్లి అక్కడి నుంచి లాంచీలో శ్రీశైలానికి చేరుకున్నట్లు వివరించారు. నల్లమల కొండల మధ్య కృష్ణానదిపై ప్రయాణం చెప్పలేని అనుభూతినిచ్చిందని, చాలా ఆనందంగా ఉందని జ్యోతి వెల్లడించారు.
ఒకే రోజు ఆరు పుణ్యక్షేత్రాల దర్శనం - ఏపీ పర్యాటక శాఖ ప్యాకేజి వివరాలివే
"గుంజివాడ గుసగుసలు" - జలపాతం అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు