Nagarjuna Reaction on Konda Surekha : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని చెప్పారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంటే మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారిని కూడా డ్రగ్స్‌కు అలవాటు చేశారని ఆక్షేపించారు. రేవ్ పార్టీలు ఏర్పాటు చేశారని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ అని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2024
వ్యక్తిగత విషయాలను గౌరవించండి : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా సినీ నటుడు నాగార్జున తీవ్రంగా ఖండించారు. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మమ్మల్ని వాడుకోవద్దని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉన్న సినీ ప్రముఖుల జీవితాలను గౌరవించండని తెలిపారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని సూచించారు. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. తమ కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమని పేర్కొన్నారు. తక్షణమే కొండా సురేఖ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నట్లు నాగార్జున ట్వీట్ చేశారు.
ఇంతకీ కొండా సురేఖ ఏమన్నారంటే? : బీసీ మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని కొండా సురేఖ ఆవేదనకు లోనయ్యారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆరే ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందని ఆరోపించారు. మంత్రి సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారని విమర్శించారు. ఐదేళ్లు బీఆర్ఎస్లో పనిచేశానని చెప్పారు. తన వ్యక్తిత్వం అందరికీ తెలుసని పేర్కొన్నారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయని అన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తిచూపాలని వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తే ఊరుకునేలేదని కొండా సురేఖ హెచ్చరించారు.