Delay in Nadu Nedu Works at Vijayawada : విజయవాడ దుర్గాపురంలోని శ్రీ టి. వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన గొప్పలన్నీ, ఇక్కడ పునాదుల్లోనే ఆగిపోయాయి. కొన్ని భవనాల స్లాబులు పూర్తైనా, మరికొన్ని అసలు నిర్మాణమే ప్రారంభం కాలేదు. మొత్తంగా ఇక్కడ నాడు-నేడు పనులు అసంపూర్ణంగా వెక్కిరిస్తున్నాయి.
Nadu Nedu Works in AP : విజయవాడ మొగల్‌రాజపురంలోని బోయపాటి శివరామకృష్ణయ్య నగరపాలక ఉన్నత పాఠశాల పరిస్థితి ఇంతే. ఇక్కడ నాడు-నేడు పనులు విద్యార్థుల పాలిట ప్రమాదంలా మారాయి. ప్రచార ఆర్భాటంతో గుంతలు తీసి నిర్మాణాలు చేపట్టకుండా వదిలేశారు. పటమటలంక ప్రాంతంలోని వల్లూరు సరోజినీదేవి స్కూల్లో పనులు అటుఇటూ కాకుండా పోయాయి. తరగతి గదుల్లోని బెంచీల్ని బయపడేసి చేపట్టిన పనులు కొలిక్కిరాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది.
ఇలా వైఎస్సార్సీపీ సర్కార్ నాడు-నేడు పనుల్లో చేసిన జాప్యానికి, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు విడతల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ ఊదరగొట్టిన జగన్, కనీసం రెండో విడత పనులూ పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారు. 1500 మంది విద్యార్థులుండే విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మున్సిపల్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తికాక వరండాలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు చెట్లకింద కూర్చుని మధ్యాహ్న భోజనం తింటున్నారు. ఇక్కడ నాడు-నేడు పనులకు రూ.2.4 కోట్లు కేటాయించినా, రూ.1.10 కోట్లు మాత్రమే బిల్లులు మంజూరు చేశారు. మిగతా నిధులు ఇవ్వకపోవడంతో ఏడాది కాలంగా పనులు ఆగిపోయాయి.
"గత ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో నిర్మాణాలన్నీ అసంపూర్తిగా మారాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు రావాలంటే భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులను ఆపివేశారు. ఇప్పటికైనా నాడు-నేడు పనులు పూర్తి చేయాలని కోరుతున్నాం. ఇవి పూర్తి చేయాలంటే కొత్త ప్రభుత్వానికి 200 కోట్లపైగా ఖర్చు అవుతుంది." -నేతలు
అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు : 2021 ఆగస్టు 16న నాడు-నేడు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ పనులను గత ప్రభుత్వం రెండున్నరేళ్లకుపైగా సాగదీసి, మధ్యలో వదిలేసింది. దీంతో తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదుల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గత సర్కార్ రూ.1000 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. సామగ్రి సరఫరా చేసిన గుత్తేదార్లకు రూ.230 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 8వేలకు పైగా తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి. కొన్నిచోట్ల మరుగుదొడ్లు పూర్తయినా, తలుపులు పెట్టకపోవడంతో వాటిని వినియోగించుకోలేని పరిస్థితి. కొన్నిచోట్ల బడుల్లో నిధులున్నా, సిమెంట్ కొరత నెలకొంది. పిల్లలకు శుద్ధ జలాలు అందించే ఆర్వోప్లాంట్ల సరఫరాను గుత్తేదారులు ఆపేశారు. బడులకు రంగులు వేయడాన్ని మధ్యలోనే వదిలేశారు. స్లాబ్‌ల మరమ్మతుల పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా మారిన పెండింగ్ పనులు : ఈ పెండింగ్ పనులు పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. పూర్తైన పనుల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. మొదటి విడతలో సరఫరా చేసిన ఆర్వోప్లాంట్లు మూడేళ్లు గ్యారంటీ ఉన్నా, బిగించిన ఆరు నెలలకే సమస్యలు ఏర్పడ్డాయి. ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సీలింగ్ ఫ్యాన్లలోనూ నాణ్యత లోపించింది. గుత్తేదారుకు జరిమానా విధించాలని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు చేసినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
నాడు-నేడు పనుల్లో నాణ్యతా లోపం- పాఠశాలల్లో విద్యార్థుల ఇక్కట్లు - Nadu Nedu Work Incomplete