Multi Talented Girl from Vijayawada: చిన్నవయసులోనే పలు రంగాలలో రాణిస్తోన్న ఈ అమ్మాయి పేరు కోమటిగుంట కౌశ్యావి. స్వస్థలం విజయవాడ. తండ్రి వ్యాపారి కాగా తల్లి గృహిణి. 17 సంవత్సరాల కౌశ్యావి ప్రస్తుతం ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. చార్టెడ్ అకౌంటెంట్ విద్యనభ్యసించడానికి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటుంది.
చదువుతో పాటు వివిధ కళలలో తమ కమార్తె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఆ రంగాలలో శిక్షణ ఇప్పించారు. చూడచక్కని నృత్యంతో మైమరిపిస్తూ ఉంటుంది. ఒక్క కూచిపూడి నృత్యంలోనే కాదండోయ్ కరాటే, చిత్రలేఖనంలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తోంది ఈ అమ్మాయి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చదువుతో పాటు మరేదైనా రంగంలో తనను తాను నిరూపించుకోవాలనుకుంది. చిన్నప్పటి నుంచి ఏకసంతాగ్రహిగా పేరుగాంచిన ఈ అమ్మాయి అనతి కాలంలోనే ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంటోంది.
మహిళల ఆత్మరక్షణకు కరాటే ఓ ఆయుధంలా పనిచేస్తుందని చెప్తోంది కౌశ్యావి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ శిక్షణ కొనసాగిస్తోంది. 2020లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి స్థానం కైవసం చేసుకుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో 15 స్వర్ణ పతకాలు, 25 సిల్వర్, 10 బ్రాంజ్ మెడల్స్‌ని సాధించింది ఈ యువ కళాకారిణి.
'నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచింది' - Chandrababu And Lokesh wishes
కరాటేతో పాటు కూచిపూడిలోనూ రాణిస్తోంది కౌశ్యావి. చిన్ననాటి నుంచి నృత్యం అంటే ఎంతో ఇష్టమని చెబుతోంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కూచిపూడి నృత్య పోటీల్లో పలు అవార్డులను కైవసం చేసుకుంది. అంతేకాదు అచ్చుగుద్దినట్టు బొమ్మలు గీస్తూ చిత్రలేఖనంలోనూ తనదైన ముద్రవేస్తోంది. కరాటే, కూచిపూడి, చిత్రలేఖనం వంటి కళలు నేర్చుకోవడంతో చదువులో చురుకుగా ఉండగలుగుతున్నానని చెప్తోంది ఈ అమ్మాయి.
తమ కుమార్తె సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు కావాలన్నదే ప్రధాన ఉద్దేశమని అంటున్నారు కౌశ్యావి తల్లిదండ్రులు. పిల్లలకు ఆసక్తి ఉన్న రంగంలోనే వారిని ప్రోత్సహిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. ఉదయం 4 గంటలకే తమ కూమార్తె దినచర్య ప్రారంభమౌతుందని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తుందని చెప్తున్నారు. సీఏ చదవడమంటే ఇష్టమని భవిష్యత్తులో ఆ రంగంలోనూ రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది కౌశ్యావి. ఛార్టెడ్ అకౌంటెంట్ అయినా కరాటే, కూచిపూడి, చిత్రలేఖనంలో ప్రదర్శనలు ఇస్తానని చెబుతోంది. ప్రతీ మహిళా ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచిస్తోంది. క్రీడలు మానసిక, శారీర ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని చెబుతోంది.