Mulapeta Greenfield Port Residents Problems : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేటలో, గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనులు సాగుతున్నాయి. భారీ యంత్రాలతో నిత్యం వేలాది లారీల్లో రాళ్లు, మట్టి తరలిస్తున్నారు. అయితే పోర్టు నిర్మాణం కోసం విలువైన భూములను త్యాగం చేసిన మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులకు మాత్రం నాటి ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా మొండిచేయి చూపింది.
భూములిస్తే పక్కా ఇళ్లు నిర్మిస్తామని, పోర్టు పనుల్లో నిర్వాసితులకు ఉద్యోగం కల్పిస్తామని అప్పటి వైఎస్సార్సీపీ నేతలు వారిని నమ్మించారు. తీరా పోర్టు పనులు ప్రారంభమైన తర్వాత, ఉపాధి మాట దేవుడెరుగు కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సైతం వారిని రానివ్వడం లేదు. ప్రభుత్వ భూమి మినహా రెండు గ్రామాల పరిధిలో 332 ఎకరాల జిరాయితీ భూముల్ని పోర్టు నిర్మాణానికి సేకరించారు. 43 మంది రైతులు 25 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు.!
పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని పట్టించుకోలేదని ఆవేదన : భూమికి పరిహారంతోపాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్సార్సీపీ నేతలు ఆ తర్వాత ముఖం చాటేశారు. పునరావాస కాలనీ నిర్మాణం ఇంకా ఆరంభ దశలోనే ఉంది. పైగా మంచినీటి సౌకర్యం లేని ఉప్పునీటి ప్రాంతంలో, కాలనీ నిర్మాణం చేపట్టారని నిర్వాసితులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ అనుకూల వర్గానికి రెట్టింపు పరిహారం ఇచ్చి, మిగిలిన వారికి అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు.
పోర్టు నిర్మాణం చేపడుతున్న కంపెనీతో ఎమ్మెల్సీ దువ్వాడ కుమ్మక్కై స్థానికులకు ఉపాధి కల్పించకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. అదేవిధంగా తమకు కాకుండా స్థానికేతురులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని వారు తప్పుబడుతున్నారు. అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తమని మోసం చేశారని గ్రామస్తులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు.
"మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను మాకు మాయమాటలు చెప్పి భూములు తీసుకున్నారు. పోర్టు కోసం మోసపూరిత హామీలు ఇచ్చారు. ఇప్పుడు మాకు నిలువ నీడ లేకుండా పోయింది. పోర్టు పనుల్లో కూడా మమ్మల్ని తీసుకోవడం లేదు. స్థానికేతరులను తీసుకువచ్చి ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నారు. వైఎస్సార్సీపీకి అనుకూలమైన వారికి పరిహారాన్ని రెట్టింపు మొత్తంలో ఇచ్చారు. అనుకూలంగా లేని వారికి అన్యాయం చేశారు. కూటమి ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని కోరుతున్నాం." - నారం నాయుడు, మూలపేట