Mughalrajapuram Caves History in Vijayawada : విజయవాడలోని మొగల్రాజపురం గుహలు ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఐదు, ఆరో శతాబ్దంలో నిర్మించిన ఈ గుహల్లో ఎంతో విలువైన సమాచారం ఉంది. మొదట ఈ గుహలు బౌద్ధ సంస్కృతికి ఆవాసాలుగా ఉండేవి. కాలక్రమేణా హైందవ సంస్కృతికి నిలయాలు మారాయని చరిత్రకారులు చెబుతున్నారు.
ప్రాచీన చరిత్ర సాక్ష్యాలుగా : విజయవాడలో ఐదు చోట్ల గుహలు ఉన్నాయి. ఈ గుహలన్నీ కొండలను చెక్కి నిర్మించినవే. మొదటి గుహ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వెనక ఉన్న రెడ్ సర్కిల్ సమీపంలో ఉంది. ఈ గుహ కింది భాగంలో గంగానమ్మకు స్థానికులు పూజలు చేస్తుంటారు. రాళ్లపై చెక్కిన మెట్లగుండా పైకి ఎక్కితే గుహ కనిపిస్తుంది. ఈ గుహలోపల ద్వార పాలకుడు, ఖాళీగా ఉండే దైవ పీఠం దర్శనం ఇస్తుంది.
గుహల్లో ఎంతో విలువైన సమాచారం : ఏనుగుతో పాటు మరికొన్ని జంతువుల శిల్పాలు, ఆకారాలు రాతిమీద చెక్కారు. రెండో గుహ శిఖామణి సెంటర్‌లో ఉంది. నటరాజ గుహగా పిలిచే దీనిలో వలంపురి గణపతి దర్శనం ఇస్తాడు. పీబీ సిద్ధార్థ కళాశాల సమీపంలో మరో రెండు గుహలు ఉన్నాయి. ఇక్కడ త్రిమూర్తుల విగ్రహాలు, దుర్గాదేవి దర్శనమిస్తారు. దుర్గాదేవి విగ్రహం వెనక్కు తిరిగి కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఇది అతిపురాతణమైన దుర్గమ్మ విగ్రహం అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ అమ్మవారికి భక్తులు పూజలు చేస్తుంటారు. ఈ గుహలకు పక్కన ఉండే సందు నుంచి వెళ్తే మరో గుహ కనిపిస్తుంది. అక్కడ విశాలమైన ప్రాంగణం, మూడు పీఠాలు ఉన్నాయి. ఇవి త్రిమూర్తుల ప్రతిమల కోసం నిర్మించి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.
అజంతా అందాలతో ఏలూరు జిల్లాలో ప్రాచీన బౌద్ధారామం - GUNTUPALLI BUDDHIST CAVES
గుహల్లో అరుదైన వలంపురి గణపతి : ఈ గుహలు ఐదో శతాబ్దానికి చెందినివిగా చరిత్రకారులు చెబుతున్నారు. పూర్ణ కుంభాలు, కలశం ఈ గుహల్లో దర్శనమిస్తున్నాయి. నటరాజ గుహలో స్వామి రాక్షసుడిపై నాట్యం చేస్తున్నట్లు చెక్కిన శిల్పం ఆకట్టుకుంటుంది. ఈ గుహలోపల భాగంలో శ్రీకృష్ణుని లీలలు కనిపిస్తాయి. ఇక్కడ మూడు గదులుగా నిర్మాణాలు ఉన్నాయి. మధ్య గదిలో శిథిలమైన శివలింగ పీఠం కనిపిస్తోంది. మూడో గుహలో నాగశిల్పం, బ్రహ్మ, విష్ణు, శివుడి శిల్పాలు ఉన్నాయి. ఈ మొగల్రాజపురం గుహలు మొదట బౌద్ధ భిక్షువుల ఆవాసాల కోసం నిర్మించినవిగా దీనిపై అధ్యయనం చేసిన వాళ్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చరిత్రకారులూ ధృవీకరించారని స్పష్టం చేస్తున్నారు