MP Galla Jayadev Comments: రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో మరోసారి స్పష్టం చేశారు. తనకు అవకాశం కల్పించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతగా ఉంటానని ఆయన అన్నారు. భారతీయుల శతాబ్దాల కలను ప్రధాని మోదీ నిజం చేశారని అన్నారు. సభలో ఎందరో పెద్దలు తనకు మార్గదర్శకంగా ఉన్నారని వివరించారు.
నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాలి : విభజన చట్టం ప్రకారం రావాల్సిన విద్యాసంస్థలు ఏపీలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో దొంగ ఓట్లపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్లో అన్నారు. ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు.
వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు నివారించాలి: ప్రజాస్వామ్య ప్రక్రియలో వ్యాపారులదీ కీలక పాత్ర అని, ఎందరో వ్యాపారులు చట్టసభలకు ఎన్నికవుతున్నారని అన్నారు. వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు నివారించాలని, రాష్ట్రం, దేశాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంటానని ప్రకటించారు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేసినట్లు తాను కూడా రాజకీయాల్లో విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విరామం తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ఆయన వివరించారు.
మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ఓ మైలురాయి : అయోధ్య రామాలయం కట్టించినందుకు మోదీకి ఎంపీ గల్లా జయదేవ్ ధన్యవాదాలు తెలిపారు. శతాబ్దాల భారతీయుల కలను ప్రధాని నిజం చేశారని, దేశం పట్ల మోదీ విజన్‌కు తన అభినందనలు అని ప్రకటించారు. పదేళ్లుగా భారత్‌ను ప్రధాని మోదీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. జీ20 దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిపారని పేర్కోన్నారు.
ఏపీ విభజన హామీలపై ఏం చెప్పారు.. ఏం జరుగుతోంది..!: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
TDP MP Galla దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, ఎయిర్‌పోర్టులు, హైవేలు దేశంలో పెద్దసంఖ్యలో వచ్చాయని వివరించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఓ మైలురాయి అని అన్నారు. పీఎం కిసాన్, పసల్ బీమా యోజన రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయని వివరించారు.
గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు : తనను పార్లమెంటుకు పంపిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు ప్రజలకు తన శాయశక్తులా కృషిచేసినట్లు పేర్కొన్నారు. అమరావతి రైతుల ఆందోళనకు ఇప్పటికీ తన మద్దతు ఉందని గల్లా వెల్లడించారు. అమరావతిని స్మార్ట్ సిటీగా నిలిపేందుకు కృషి చేసినట్లు తెలిపారు.