A Mother Left her Baby in Kadiri : తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చిన ఆ మాతృమూర్తికి కడుపు తీపి గుర్తుకు రాలేదేమో! ముద్దు లొలికే ఆ పాపాయిని వదిలి వెళ్లేందుకు. ఆ చిట్టి ప్రాణాన్ని భూమ్మీదకు తీసుకు వచ్చేందుకు పడ్డ పురిటి నొప్పులు మరిచి పోయిందేమో! పేగు బంధాన్ని వదిలి పెట్టేసింది ఆ తల్లి. కష్టమే వచ్చిందో, భారమని భావించిందో! ఆడపిల్ల అని వదిలించుకోవాలని అనుకున్నారో తెలియదు కానీ ఆ పసికందును ఇతరుల చేతిలో పెట్టి అక్కడి నుంచి ఆ తల్లి వెళ్లిపోయింది.
'నిద్రిస్తున్న నన్ను లేపి స్నానం చేయిస్తే నా కోసమే కదా అని మురిసిపోయా. చేతినిండా గాజులు తొడిగి నుదుట బొట్టుపెడితే మా అమ్మ ఎంత మంచిదోనని సంబరపడ్డా. మంచి దుస్తులు తొడిగి బస్టాండుకు తీసుకొస్తే అమ్మమ్మ ఊరికి వెళుతున్నామని గెంతులేశా. అంతలోనే పని ఉందంటూ అనామకురాలి చేతిలో పెట్టిపోతే అమ్మే కదా వెంటనే వస్తుందులే అని ఎదురుచూశా. కాలం కరిగిపోతున్నా ఎంతసేపటికీ నువ్వురాకపోయేసరికి పసికందునైన నేను పలువురి చేతులు మారుతున్నా. ఎంతమంది ఊరడించి చేరదీస్తున్నా నీ పక్కనుంటే ఆ ఆనందమే వేరు కదమ్మా. ఎవరి దిష్టీ తగలకూడదని చుక్కపెట్టి తీసుకొచ్చి చివరికి దిక్కులేనిదాన్ని చేసి వెళ్లావా అమ్మా' అని ఆ ఐదు నెల పసికందు ఆవేదన. గుండెలు బరువెక్కెలా చేసే ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
Baby Found in Kadiri Bus Stand : కదిరి ఆర్టీసీ బస్టాండు ఆవరణలోనికి ఆదివారం నాడు ఐదునెలల పసికందుతో ఓ మహిళ వచ్చింది. మూత్ర విసర్జనకు వెళ్లాలంటూ ఓ బీటెక్ విద్యార్థినికి చిన్నారిని అప్పగించింది. గంటలు గడుస్తున్నా సదరు మహిళ తిరిగిరాలేదు. పరిసరాల్లో వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. విద్యార్థిని వెళ్లాల్సిన బస్సు రావడంతో ఆమె డయల్ 100కు ఫోన్‌చేసి పాప విషయాన్ని తెలియజేసింది. సమాచారం అందుకున్న కదిరి పట్టణ పోలీసులు ఆర్టీసీ బస్టాండుకు చేరుకుని చిన్నారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
అనంతరం పోలీసులు ఈ విషయాన్ని ఐసీడీఎస్ అధికారులకు తెలియచేసి పాపను వారికి అప్పగించారు. మరోవైపు పసికందును తీసుకొచ్చిన మహిళ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే కోణంలో ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. చిన్నారిని వదిలివెళ్లిన మహిళపై సుమోటాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నారాయణరెడ్డి పేర్కొన్నారు.
అయ్యో పాపం.. అప్పుడే పుట్టిన పసికందు చెత్తకుప్పలో.. నంద్యాలలో దారుణం
నాన్న నన్ను ఎందుకు అమ్మేశావ్ - నేనేం తప్పు చేశాను? - Baby Girl Sale in Guntur