BRS Warm Welcome to MLC Kavitha : ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని, తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం, జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. తాను కడిగిన ముత్యంలా అపవాదుల నుంచి బయటపడతానని, నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని ఎమ్మెల్సీ కవిత పునరుద్ఘాటించారు.
గులాబీ శ్రేణుల ఘనస్వాగతం : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలు, కుటుంబసభ్యులు కేటీఆర్, భర్త అనిల్ కుమార్, కుమారుడు ఆదిత్యతో మధ్యాహ్నం దిల్లీ నుంచి బయల్దేరిన కవిత, సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గులాబీ కార్యకర్తలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా సందడిగా మారింది.
కవితపై పార్టీ కర్యకర్తలు పూలవర్షం కురిపించారు. బోకేలు ఇచ్చేందుకు కార్యకర్తలు, అభిమానులు పోటీ పడ్డారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసిన కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. విమానాశ్రయం నుంచి బంజారాహిల్స్‌లోని నివాసానికి కవిత వెళ్లారు. కవితను చూసేందుకు ఆమె నివాసానికి తల్లి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం కవిత ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు.
164 రోజుల తర్వాత విడుదల: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత 164 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన పూచీకత్తును కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. వాటిని అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు కవిత విడుదలకు అనుమతిస్తూ తీహాడ్ జైలుకు వారెంట్ జారీ చేసింది.
ఊరు దాటాలంటే వాగు ఈదాల్సిందే- 'ఇకనైనా రహదారి నిర్మించరూ' - no Road Facility In Alluri district