MLA Medipalli Satyam Wife Suicide in Hyderabad : కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూపాదేవి హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబీకులు ఆమె మృతదేహాన్ని అల్వాల్‌లోని తమ నివాసానికి తరలించారు. తిరుమలగిరిలోని డెయిరీ ఫామ్ సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించినున్నట్లు తెలిపారు.
ఇదీ జరిగింది : గురువారం రాత్రి 10 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లిన రూపాదేవి, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో రూపాదేవి తల్లి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గుర్తించిన తల్లి పక్కింటి వాళ్ల సాయంతో సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. నియోజకవర్గ పనుల నిమిత్తం చొప్పదండి వెళ్లిన ఎమ్మెల్యే విషయం తెలుసుకుని చొప్పదండి నుంచి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. భార్య మృతి చెందిన విషయాన్ని తట్టుకోలేని సత్యం రక్తపోటు తగ్గి అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు.
కడుపు నొప్పి తట్టుకోలేకే! : రూపాదేవి మరణించడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన అల్వాల్ పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. రూపాదేవి గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోందని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. కడుపు నొప్పితోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రూపాదేవికి 12 ఏళ్ల క్రితం మేడిపల్లి సత్యంతో ప్రేమ వివాహం జరిగింది. ఆమె ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.
రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత మార్చురీ వద్దకు చేరుకొని పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. గాంధీ మార్చురీ విభాగాధిపతి కృపాల్ సింగ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహచర ఎమ్మెల్యే సత్యం భార్య మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓయూ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం - ప్రేమ వైఫల్యమే కారణమా?