MLA Kunamneni Fires On Harish Rao : అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావుపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. హరీశ్‌రావు తన జోలికి రావద్దని కోరారు. లేదంటే తన ఒరిజినాలిటీ చూపిస్తానంటూ హెచ్చరించారు. అసెంబ్లీలో తాను మాట్లాడుతున్నప్పుడే ఆయనకు అన్నీ గుర్తుకొస్తున్నాయని కూనంనేని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. గత సర్కారు చేసిన తప్పిదాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని భావిస్తున్నట్లుగా తెలిపారు.
Kunamneni On Congress Govt : విద్యా వ్యవస్థలో అనేక లోపాలు నెలకొన్నాయని వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూనంనేని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షలకు పెంచినప్పటికీ చాలా కార్పోరేట్ ఆసుపత్రులు అనుమతివ్వడంలేదని సభలో వివరించారు. నీటిపారుదల రంగం ఏటీఎంలా తయారయ్యిందని ఆయన ఆక్షేపించారు. వాటికి సంబంధించిన ప్రాజెక్టుల్లో పెద్దకుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో అతిపెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు. జర్నలిస్టుల కోసం ఓ పాలసీ తీసుకువచ్చి జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని కూనంనేని కోరారు.
CPI Chada Venkat Reddy On Palamuru Project : పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సాధించేందుకు అవసరమైతే జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై అఖిలపక్షాన్ని పిలవాలని సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సీపీఐ ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎన్డీఏ కూటమి మద్దతు దారుల రాష్ట్రాలకే బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు.
తెలంగాణాలో వెనుకబడిన ప్రాంతాలు గుర్తుకురాలేదా : విభజన చట్టంలో అమలు చేయాల్సిన హామీల ప్రకారం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించిన కేంద్రానికి తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే బడ్జెట్లో మొండిచేయి చూపారని మండి పడ్డారు.
ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఎంపీలు మోదీని నిలదీయాలన్నారు. పాలమూరు బిడ్డగా రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలని, రానున్న మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కోరారు. సమగ్ర భూసర్వే చేపట్టకుండా ధరణి సమస్య పరిష్కారం సాధ్యం కాదన్న చాడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం : కూనంనేని సాంబశివరావు