Miyapur Govt Land Encroachment Over : కొన్ని రోజులుగా మియాపూర్లోని ప్రభుత్వ భూమి ప్రాంతాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమేసి, కొన్నిరోజులుగా సాగుతున్న ఉద్రిక్తతకు తెరదించారు. ఈ క్రమంలో మియాపూర్ ప్రభుత్వ భూమి గల ప్రాంతాన్ని హెచ్ఎండీఏ (HMDA) అధికారులతో కలిసి సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి పరిశీలించారు. శనివారం జరిగిన ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులను సీపీ అవినాశ్ మహంతి సమీక్షించారు. మళ్లీ ప్రభుత్వ స్థలంలోకి ప్రజలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై హెచ్ఎండీఏ అధికారులతో చర్చించారు.
ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలం ఆక్రమించేందుకు వచ్చిన ప్రజలను శనివారం రాత్రి పోలీసులు అక్కడి నుంచి తరలించారు. పలువురు స్వచ్ఛందంగానే అక్కడి నుంచి తరలివెళ్లారు. మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంగీత అనే మహిళతో పాటు మరికొంతమంది మహిళలు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి, ప్రభుత్వ స్థలంలోకి వచ్చేలా ప్రేరేపితం చేశారని పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టారని తెలిపారు. మియాపూర్లోని ఓ స్థానిక ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలకు ఆశ చూపి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేదలను రెచ్చగొట్టిన సంగీత, సీత, సంతోశ్ అనే ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరితో పాటు మరికొంత మందిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తెర వెనక నుంచి నడిపించిన కబ్జాదారుల గురించి తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. కబ్జాదారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం.
144 సెక్షన్ విధింపు : మరోవైపు మియాపూర్ ప్రభుత్వ భూమి ఆక్రమణ ఉద్రిక్తతల నేపథ్యంలో మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. ఈ నెల 29 అర్ధరాత్రి వరకు మియాపూర్, చందానగర్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
మియాపూర్ భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు : హైకోర్టు
కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలకు ఇక చెల్లు - 2 స్కై వేల నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా