Miscreant Set Fire to Three Bikes in Kadapa: కడప నగరంలో అర్ధరాత్రి వేళ ఓ ఆకతాయి హల్‌చల్ చేశాడు. గంజాయి మత్తులో నివాసాల ఎదుట పార్కింగ్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టాడు. పోలీసుల పెట్రోలింగ్ లేకపోవడంతోనే ఆకతాయిలు రెచ్చిపోతున్నారని బాధితుడు ఆరోపించాడు. కడపలోని నాగరాజుపేటలో గురువారం తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో ఓ యువకుడు గంజాయి మత్తులో వచ్చి నివాసాల ఎదుట పార్కింగ్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టాడు.
అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజ్ సమీపంలో పార్కింగ్ చేసిన మరో ద్విచక్ర వాహనానికి సైతం నిప్పు పెట్టాడు. మంటలు చెలరేగడంతో స్థానికులు గుర్తించి బయటికి వచ్చి వాటిని ఆర్పారు. అప్పటికే రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. మరో ద్విచక్ర వాహనం పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్లలో రికార్డు కావడంతో స్థానికులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మద్యం తాగి డ్రైవ్ - ఫైన్ వేశారని బైక్‌కు నిప్పు - వీడియో వైరల్
తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మద్యం దుకాణం వద్ద ఉన్న యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నాగరాజుపేటలో గడిచిన ఐదు నెలలులో ఏడు దొంగతనాలు జరిగాయని, ఇలా ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయని బాధితులు వాపోయారు. రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ అసలు కనిపించడం లేదని, గతంలో ఇలా జరిగేది కాదని తెలిపారు. ఇటీవల కాలంలోనే దొంగతనాలు వాహనాలకు నిప్పు పెట్టడం ఎక్కువయ్యాయని స్థానికులు పేర్కొన్నారు. కాలిపోయిన వాహనాలకు సంబంధించి నష్టం విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుందని బాధితుడు చెప్పారు.
"రాత్రి సుమారు 2:45 సమయంలో ఓ వ్యక్తి మా కాలనీలోకి నడుచుకుంటూ వచ్చాడు. మేము ప్రతి రోజూ వాడే రెండు బైక్‌లను బయట పెట్టి క్లాత్‌తో కప్పి ఉంచాము. ఆ బైక్‌లపై ఏదో లిక్విడ్ వేసి, నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. దాని తర్వాతే వేరే దగ్గర కూడా మరో బైక్ తగలబెట్టాడు. మేము సీసీ టీవీ ఫుటేజ్‌ని పరిశీలించి చూశాము. అందులో కనిపించిన వ్యక్తిని పట్టుకోవడానికి మేము వెళ్లాము. పాత బస్టాండ్ దగ్గర ఆ వ్యక్తిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించాము. నాగరాజుపేటలో గత ఆరు నెలలుగా ఒకదాని తర్వాత మరో ఘటన ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇక్కడ పోలీసుల పెట్రోలింగ్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా పెట్రోలింగ్ పెంచాలని పోలీసులను కోరుకుంటున్నాము". - వంశీ, బాధితుడు
ఆకతాయిల నిర్వాకం - మూసేసిన సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం
సాధువుకు నిప్పంటించిన దుండగులు- ఊపిరాడక నిద్రలోనే ఐదుగురు మృతి