Mirchi Price Problems in Andhra Pradesh : ప్రకృతి సహకరించకపోయినా, పాలకులు సమస్యలను పట్టించుకోకపోయినా నేలతల్లినే నమ్ముకుని సాగుచేసిన మిర్చి పంట రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. అహర్నిశలు శ్రమించి మిరప సాగు చేసిన అన్నదాతలకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మార్కెట్లో మిర్చి ధర నేలచూపులు చూడటంతో రైతులకు అప్పులే మిగిలేలా ఉన్నాయి. ఎప్పటికైనా మంచి ధర వస్తుందన్న ఆశతో ఆర్ధికంగా భారమైనా పంటను శీతల గిడ్డంగుల్లో భద్రపరుస్తున్నారు.
Guntur District : ఉమ్మడి గుంటూరుతో పాటు ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురంలో మిరప పంటను అధికంగా సాగు చేస్తుంటారు. ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొని మిర్చిని పండించారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటను కాపాడుకున్నారు. గతేడాదితో పోలిస్తే అన్నిచోట్లా మిరప దిగుబడి బాగా తగ్గింది. దీంతో మార్కెట్లో డిమాండ్ పెరిగి, మంచి ధర వస్తుందనే ఆశతో రాష్ట్రం నలుమూలల నుంచి గుంటూరు మిర్చి యార్డ్‌కు రైతులు భారీగా మిర్చి తీసుకొచ్చారు. కానీ మిరప ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు.
Chilli Farmers Problems: అందని సాగు నీళ్లు.. పంటకు తెగుళ్లు.. మిర్చి రైతు కన్నీళ్లు
No Price Mirchi Crop : సాగునీటి ఎద్దడి వల్ల వరికి దూరమైన రైతులు, తెగుళ్లకు భయపడి ప్రత్తిని పక్కనపెట్టి మిరప వైపు మెుగ్గు చూపారు. నీరు సమృద్ధిగా లేకపోవడంతో ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల మధ్య దిగుబడులు వచ్చే మిరప ఈ ఏడాది 10 క్వింటాళ్లకే పరిమితమైంది. పంట తక్కువగా ఉంటే ధర అధికంగా ఉండటం సహజం. కానీ ఈ ఏడాది ధర కూడా అదే స్థాయిలో పడిపోవడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు.
"మిర్చి పంటను పండించడానికి ఎకరానికి రూ.లక్ష రూపాయల పెట్టుబడి పెట్టాము. ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పుడు మార్కెట్లో క్వింటా ధర రూ.8000 నుంచి రూ.9000 పలుకుతుంది. మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నాము" - మిర్చి రైతు
గుంటూరు జిల్లాలో 120కిపైగా ప్రైవేట్ శీతల గిడ్డంగులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 70 శాతం వరకు మిర్చి పంటనే నిల్వ చేశారు. గుంటూరు నుంచి మాచర్ల, చిలకలూరిపేట మార్గాల్లో ఉన్న కోల్డ్ స్టోరేజ్‌లన్నీ ఇప్పటికే మిర్చితో నిండిపోయాయి. బస్తాకు 200 రూపాయల చొప్పున చెల్లించి మరీ అన్నదాతలు మిరపను భద్రంగా దాచారు. ఎప్పుడు ధరలు పెరుగుతాయా అని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.