Minority Rights Protection Committee Support: రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సహరించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షిబ్లీ తెలిపారు. గతంలో టీడీపీ, బీజేపీతో పొత్తులో ఉన్న 5 ఏళ్లలో కూడా ముస్లింల అభివృద్ధిని ఎక్కడా విస్మరించలేదన్నారు. ఈ మేరకు విజయవాడలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి జెండాను అవిష్కరించారు.
అలాగే వైసీపీ పాలనలో మైనార్టీ సంక్షేమాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది, వారిపై దాడులకు సంబంధించిన సమాచారంతో రుపొందించిన గోడ పత్రికను విడుదల చేశారు. ముస్లింలపై జరుగుతున్న దాడులు, మైనార్టీల అభివృద్ధిపై నేతలు చర్చించారు. వైసీపీ పాలనలో ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు ముస్లింలపై 107 దాడులు జరిగాయని, వైసీపీ దాడులను ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని తీసుకుని వెళ్లి వారిపై కేసులు పెడుతున్నారని, ప్రశంసించిన వారిని అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో సంక్షేమాన్ని పూర్తిగా అటకెక్కించేశారని దుయ్యబట్టారు.
'రాబోయే ఎన్నికల్లో టీడీపీకి సహకరిస్తాం' - మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఏకగ్రీవ తీర్మానం
సెక్యూలర్కు మారు పేరు చంద్రబాబు నాయుడని తెలిపారు. టీడీపీ పాలనలో ఎక్కడా ముస్లింల ఆత్మగౌరవానికి భంగం కలగలేదన్నారు. తాము బీజేపీతో లేమని అంటునే, ముఖ్యమంత్రి జగన్ అంతర్గతంగా భారతీయ జనతా పార్టీకి మోకరిల్లుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లులకు చంద్రబాబు వ్యతిరేకంగా గళం విప్పాలని కోరారు. ముస్లిం, మైనార్టీల హక్కుల సాధన, అభివృద్ధి కోసమే టీడీపీకి మద్దతు ఇస్తున్నామని వివరించారు. రానున్న రోజుల్లో ఇంటింటికి వెళ్లి టీడీపీ విజయానికి ప్రచారం చేస్తామని విశ్రాంత న్యాయమూర్తి షేక్ ఇంతియాజ్ ఆహ్మద్ తెలిపారు.
"నాడు టీడీపీ హయాంలో, నేడు వైసీపీ హయాంలో అనేది చూసుకుంటే సంక్షేమం అనేది ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయింది. ఏదైనా అడిగితే మన ఆత్మగౌరవం ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని తీసుకుని వెళ్లి వారిపై కేసులు పెడుతున్నారు. ప్రశంసించిన వారిని అందలం ఎక్కిస్తున్నారు. ముందుగా గతంలో అయిదేళ్లలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఎక్కడా కూడా ముస్లింలపై దాడులు జరగలేదు. అదే విధంగా మా ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రశ్నార్థంగా చేయలేదు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత చూసుకుంటే 107 దాడులు ముస్లిం మైనారిటీలపై జరిగాయి. అంతే కాకుండా సంక్షేమాన్ని పూర్తిగా అటకెక్కించేశారు". - ఫరూక్ షిబ్లి, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు