Minister Bhatti Review on Power Supply : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో ఏర్పడిన విద్యుత్ సమస్యలపై డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ అధికారులతో మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం కలిగిన చోట పునరుద్ధరణకు కలెక్టర్, పోలీస్ రెవెన్యూ, జిల్లా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని ఆదేశించారు.
విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ : వరదల వల్ల నీట మునిగిన సబ్ స్టేషన్లు, పిడుగులు పడి దెబ్బతిన్న చోట మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా పక్క సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్తును సరఫరా చేయాలని మంత్రి భట్టి ఆదేశించారు. 24గంటలు అలర్ట్‌గా ఉండి కంట్రోల్‌రూమ్ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు అమలు చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయానికి సంబంధించిన సమస్యలు ఉంటే ప్రజలు వాటి పరిష్కారం కోసం విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
రోడ్ల దుస్థితిపై కన్నేయండి : వాతావరణశాఖ రాష్ట్రంలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లా కలెక్టర్లు, ఆర్ అండ్ బీ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. హైడ్రాతో గొలుసుకట్టు చెరువులను పునరుద్దరణ చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి హైదరాబాద్‌కు వరద ముంపు ఉండదన్నారు.
ఇరిగేషన్లో సెలవులు రద్దు : రాష్ట్రంలో రెడ్ ఎలెర్ట్ ప్రకటించినందున నీటిపారుదల శాఖా సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నీటిపారుదల శాఖాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువుల డ్యామేజీలను ఎప్పటికప్పుడు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. విపత్తుల సమయంలో నిధుల గురించి ఆలోచన చేయవద్దన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల వారిగా ఆయన సీఈ, ఎస్ఈలతో మాట్లాడుతూ ఆయా జిల్లాల పరిస్థితులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
రెయిన్ ఎఫెక్ట్ : విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం - HOLIDAY FOR SCHOOLS