Ministers on Irrigation Sector in AP: వ్యవసాయాన్ని కాపాడుకోవడం, రైతులను రక్షించుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని గుర్తుచేశారు. తాగునీరు, సాగునీరును జగన్ మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారని, వైఎస్సార్సీపీ హయాంలో ఇరిగేషన్ శాఖను 20 ఏళ్లు వెనక్కి లాగిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు, పశ్చిమ డెల్టా కాల్వలకు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మలతోపాటు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధప్రసాద్, బొండా ఉమా, కాగితపు కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిమ్మల పట్టిసీమను ఒట్టిసీమన్న జగన్.. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ నీళ్లు డెల్టా సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయని గుర్తుచేశారు.
పట్టిసీమకు గోదావరి పరవళ్లు - ఆనందంలో అన్నదాతలు - Pattiseema Lift Irrigation Project
ఒకప్పుడు పట్టిసీమను ఒట్టిసీమ అంటూ ఎగతాళి చేసిన వైఎస్సార్సీపీ నాయకులు ఆ ప్రాజెక్టు ఎంత ఉపయోగకరమో తెలుసుకోవాలని సూచించారు. గత ఐదేళ్లు ఇసుక, మద్యం అమ్మకాలతో వేలకోట్లు కొల్లగొట్టడంపైనే దృష్టి పెట్టిన వైఎస్సార్సీపీ నేతలు సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం చివరి ఎకరాకు నీళ్లిచ్చేవరకు ప్రయత్నం చేస్తుందని అన్నారు.
ఇరిగేషన్ రంగాన్ని వైఎస్సార్సీపీ హయాంలో తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆక్షేపించారు. వేలాది ఎకరాలకు సాగునీరందించే చింతలపూడి ప్రాజెక్టును వైఎస్సార్సీపీ పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల పులిచింతల ఎండిపోయిందని మండిపడ్డారు. దీనిపై ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. 30, 40 టీఎంసీల నీరు ఉండాల్సిన చోట అర టీఎంసీ కూడా నీరు నిల్వలేదన్నారు. జగన్ ప్రభుత్వం హయాంలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని, కనీసం కాలువల నిర్వహణను కూడా పట్టించుకోలేదని మంత్రులు విమర్శించారు.