Ministers Visit on Flood Areas in AP : విజయవాడ ఓల్డ్ రాజరాజేశ్వరి పేటలో వరద ముంపులో ఉన్న ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. వరద నీటిలో తిరిగి బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి దాటాక ముంపు ప్రాంతాల్లో మరోసారి ఆకస్మిక పర్యటన చేపట్టిన ఆయన ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వర్షంలోనూ వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు.
ప్రజాప్రతినిధుల పర్యటన : పాతరాజరాజేశ్వరీపేట, వించిపేట తదితర ప్రాంతాల్లో మంత్రి సవిత పర్యటించి అక్కడ జరుగుతున్న పనుల్ని పర్యవేక్షించారు. అగ్నిమాపక శకటం ద్వారా ఇళ్లు, దుకాణాలు శుభ్రం చేసే పనిలో సవిత పాల్గొన్నారు. కబేళా, చిట్టీనగర్ రామరాజునగర్, పవర్ స్టేషన్ రోడ్డు, జోజి నగర్‌లలో బోటులో మంత్రి అచ్చెన్నాయుడు విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, ఆర్సీఎం చర్చిలో ఉన్న వరద బాధితులకు మంత్రి నాదెండ్ల మనోహర్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. బందుల దొడ్డి, అమ్మ కళ్యాణ మండపం, గంగిరెద్దులదిబ్బ, కర్మల్ నగర్, గణదల, ఆదర్శ కాలనీ తదితర వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి ఆనం రామానారాయణరెడ్డి పర్యటించారు. బాధితులను పరామర్శించి ప్రభుత్వం ఆదుకుటుందని భరోసా కల్పించారు.
వరద బాధితులకు మంత్రుల భరోసా- సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా - MINISTERs REVIEW ON FLOODS
ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం : కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ, పల్లెపాలెం, ఎడ్లంక గ్రామాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పర్యటించారు. వరద బాధితులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. నందివాడ మండలంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. బోట్ల ద్వారా ముంపు గ్రామాలకు చేరుకుని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు : బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు పర్యటించారు. మళ్లీ వరద వస్తున్నందున ప్రజలు పునరావాస కేంద్రానికి వెళ్లాలని సూచించారు. వరదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన గుంటూరు రామిరెడ్డి తోటకు చెందిన వనమాల శ్రీనివాసరావు కుటుంబానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ప్రకాశం బ్యారేజ్‌కి వరద ఉద్ధృతి మళ్లీ పెరుగుతుండటంతో బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అప్రమత్తం చేశారు. అధికార యంత్రాంగంతో మాట్లాడిన మంత్రి లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి వెళ్లే వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని గొట్టిపాటి రవి సూచించారు.