TG IRRIGATION DEPT REVIEW MEET : ప్రాధాన్యత ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టార్లకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తయ్యేలా చూసే బాధ్యత కూడా అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులలో ఆలస్యం చేస్తూ కాంట్రాక్టుర్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
చర్యలు తప్పవు : రాష్ట్రంలోని నీటి పారుదల ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎర్రమంజిల్ లోని జలసౌదలో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని మంత్రి స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో పనుల లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు సకాలంలో పూర్తి కావాల్సిందేనన్నారు.
అంకితభావంతో పనిచేయాలి : పనులు మంచిగా పూర్తి చేసే వారిని తప్పకుండా గుర్తిస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే చర్యలు తప్పవన్నారు. పనుల్లో నిబద్ధత, అంకితభావం తప్పకుండా ఉండాలన్నారు. ప్రాజెక్టులలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. పనులు బాధ్యతగా చేయాలని, పనులు సకాలంలో పూర్తి కావాల్సిందేనని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా పనులు జరగాలన్నారు.
ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే విజ్ఞప్తలను వెంటవెంటనే పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. ప్రజా ధనం అత్యంత విలువైనదని, ప్రతి పైసా చాలా జాగ్రత్తగా వ్యయం చేయాలని తెలిపారు. ఉన్నత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా పనులు చేయకుండా క్రమశిక్షణగా పనులు చేసి టార్గెట్ పూర్తి చేయాలని పేర్కొన్నారు.ఆపరేషన్, మెయింటెనెన్సు సమగ్రంగా, సమర్థవంతంగా జరగాలన్నారు.
ప్రతి రోజు కాలువలు పరిశీలన, వర్షాకాలంలో చేపట్టాలాల్సిన చర్యలు, చెరువులు, కాలువలు మరమ్మతులు, వరద నివారణ తదితర పనులు సమర్థవంతంగా చేపట్టాలని మంత్రి వివరించారు. పనులు వేగంగా, పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్న మంత్రి, ప్రతి 15 రోజుల ఒకసారి రాష్ట్ర స్థాయి సమీక్ష చేస్తామని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్య నాథ్‌దాస్, నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ తదితరులు పాల్గొన్నారు.