Minister Tummala on Seeds Supply in Telangana: విత్తన సరఫరాలో ఇబ్బంది సృష్టిస్తే ఏ కంపెనీని ఉపేక్షించబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలకు భంగం కల్గించే ఏ చర్యని ప్రభుత్వం సహించబోదని తేల్చిచెప్పారు. విధుల్లో అలసత్వం వహించిన అధికారులపైనా చర్యలు తప్పవని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేసుకొని విత్తన అమ్మకాలు పర్యవేక్షిస్తూ నకిలీ విత్తనాలకి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు.
మిగిలిన వారికి త్వరలోనే రైతుబంధం అందిస్తాం : మంత్రి తుమ్మల
రైతాంగం ప్రయోజనాల కోసం : 2024 ఖరీఫ్‌లో దాదాపు 60.53 లక్షల ఎకరాల్లో పత్తిసాగు అంచనా వేసినట్లు చెప్పిన తుమ్మల అందుకు సరిపడా బోల్‌గార్డ్ బీజీ-2 పత్తి విత్తనాలు మే చివరి నాటికి రైతులకి అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. ప్రపంచ మార్కెట్‌లో ప్రత్తి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అన్నారు. గత ఏడాది 90 లక్షల ప్యాకెట్లు అమ్ముడుపోగా ఈసారి 120 లక్షల ప్యాకెట్లు మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. బీజీ-2 విత్తన ప్యాకెట్ గరిష్ట ధర 864 రూపాయలుగా కేంద్రం నిర్ణయించిన రాష్ట్రంలో ఎవరైనా అంతకంటే ఎక్కువకి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
మే చివరినాటికి రైతులకు బీజీ-2 విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈసారి బీజీ-2 పత్తి విత్తన ప్యాకెట్ ధరను కేంద్రం రూ.864గా నిర్ణయించింది. ఏ ఒక్క డీలరైనా అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. -తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి
కాలువ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల : ఆగస్టు 15 వరకు సీతారామా ప్రాజెక్టు కాలువ అనుసంధాన పనులు పూర్తిచేసి వైరా జలాశయానికి నీటిని అందించేలా చర్యలు చేపడుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో వైరా జలాశయానికి గోదావరి జలాలు అనుసంధానం చేసే సీతారామ కాలువ పనులను స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో కలిసి మంత్రి తుమ్మల పరిశీలించారు. సీతారామ కాలువ ద్వారా నాగార్జునసాగర్ ఎడమ కాలువలో కి నీటిని అనుసంధానం చేయడం ద్వారా వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల తాగు, సాగునీటి కొరతను తీర్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.