Minister Tummala on Crop Damage : అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని మద్ధతు ధరకే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రానున్న తొలకరి నేపథ్యంలో రైతులకు అవసరమైన జీలుగ, పిల్లిపెసర విత్తనాలను సిద్దం చేసినట్లు మంత్రి తెలిపారు. ఖమ్మంలోని సంజీవ రెడ్డి భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా నాయకుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి తుమ్మల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ త్వరలో వానాకాలం సాగు సీజన్ ప్రారంభం కానున్న వేళ, రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని కంపెనీలకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్డు మీదకు వచ్చే పనిలేకుండా అన్నీ అందుబాటులో ఉంచామన్నారు. నాణ్యమైన విత్తనాలతోనే రైతులు అధిక దిగుబడులు తీస్తారని మంత్రి తుమ్మల తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అబద్దాలు చెప్పి, మోసం చేసి పాలన సాగించాలని అనుకోవడం లేదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందన్నారు. ఐదు ఎకరాలు పైబడిన రైతులందరికి ఒక్క రోజులోనే రైతుభరోసా డబ్బులు పంపిణి చేశామన్నారు. ఎకరాకు రూ. 15000 రైతుభరోసా నిధులను రాబోయే బడ్జెట్లో పెట్టనున్నట్లు తెలిపారు.
కిసాన్ కాంగ్రెస్ సెల్ ద్వారా, రైతుల నుంచి సలహాలు తీసుకుని రైతుభరోసా విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. భూస్వాములకు కాకుండా అర్హులైన రైతులకే రైతుభరోసా అందించనున్నట్లు తెలిపారు. త్వరలో పంటబీమా అమలులోకి తెస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వమే ప్రీమియం చెల్లించనున్నట్లు తెలిపారు. రైతాంగానికి మరిన్ని నూతన పథకాలు తీసుకురానున్నట్లు తెలిపారు.
ఖమ్మం జిల్లా రైతులు ప్రోగ్రెసివ్‌గా ఉండాలని మంత్రి తుమ్మల సూచించారు. సంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలవైపు దృష్టిసారించాలని ఆయన పేర్కొన్నారు. పామాయిల్ వంటి తోట పంటల తరహాలో శాశ్వతంగా ఆదాయం ఇచ్చే పంటలు సాగు చేయాలని సూచించారు. పామాయిల్ పంటలో అంతర పంటలు కూడా సాగుచేసుకోవచ్చని మంత్రి తెలిపారు.
"రైతులకు కావాల్సిన అన్ని విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశాము. కిసాన్ కాంగ్రెస్ సెల్ ద్వారా, రైతుల నుంచి సలహాలు తీసుకుని రైతుభరోసా విధివిధానాలు ఖరారు చేస్తాము. అర్హులైన రైతులకే రైతుభరోసా అందిస్తాము. అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దు. రాష్ట్రప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని మద్ధతు ధరకే కొనుగోలు చేస్తుంది". - తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
జొన్నరైతులకు గుడ్‌న్యూస్ - మద్దతు ధరకు ప్రభుత్వమే పంట కొనుగోలు - Govt Focus On Sorghum Procurement