Tummala Letters to Central Govt : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswar rao) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలో రైతుల ప్రయోజనాల కోసం ముడి పామాయిల్ ధరలు స్థిరీకరించేందుకు ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాలు విధించాలంటూ విజ్ఞప్తి చేశారు. పామాయిల్ గెలలకు లాభదాయకమైన ధరలు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరారు.
దేశంలో వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం 1992 నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్‌పామ్ సాగు అభివృద్ధిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పంట సాగు, కేంద్ర ప్రాయోజిత నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ అయిల్స్ -ఆయిల్‌పామ్(NMEO-OP) పథకం ద్వారా అమలవుతుందని కేంద్రానికి రాసిన లేఖలో ఆయన ప్రస్తావించారు.
Oilpalm Cultivation in Telangana : రాష్ట్రంలో 1992-93 నుంచి 2023-24 వరకు సుమారు 2 లక్షల ఎకరాల విస్తీర్ణం మేర ఆయిల్‌పామ్(Oilpalm Crop) సాగు కిందకు తీసుకురావడమైందని గుర్తు చేశారు. రైతుల సౌకర్యార్థం 31 జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు, రాష్ట్ర ప్రభుత్వం 14 కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని స్పష్టం చేశారు. ఆయిల్‌పామ్ మొక్కలు పెంచి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి వరకు కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా 42 పామాయిల్ నర్సరీలు ఏర్పాటు చేశాయని చెప్పారు.
ఇటీవల రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా, పామాయిల్ సాగు పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ముడి పామాయిల్ దిగుమతులపై ఉన్న సుంకం కేంద్రం పూర్తిగా ఎత్తివేసిందని వివరించారు. దేశీయ ఆయిల్‌పామ్ రైతుల విస్తృత ప్రయోజనాలు సంరక్షించడానికి ముడి పామాయిల్ దిగుమతులపై వెంటనే మళ్లీ సుంకం విధించాలని సూచించారు. ఆయిల్‌పామ్ గెలల ధరలు కనీసం టన్నుకు 18 వేలు రూపాయలు ఉండేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
'నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును త్వరగా ఏర్పాటు చేయండి' - కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
కేంద్ర ప్రభుత్వం 2021లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ అయిల్స్ - ఆయిల్‌పామ్ ప్రారంభించి రైతులకు లాభదాయకమైన ధరలు అందించాలనే ఉద్దేశ్యంతో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే సూత్రం ప్రతిపాదించిందని అన్నారు. ఈ సూత్రం 19 శాతం నూనె ఉత్పత్తి శాతం ప్రామాణికంగా తీసుకొని పామాయిల్ గెలల ధరలు నిర్ణయించబడుతుందని తెలిపారు. పైగా ఉప ఉత్పత్తులైన ఆయిల్‌పామ్ గింజలు నుంచి వచ్చే నూనె ధర పరిగణలోకి తీసుకున్నట్లయితే నూనె ఉత్పత్తి శాతం సుమారు 22 శాతంగా లభిస్తుదని, 19 శాతంగా నూనె ఉత్పత్తి శాతం నిర్ణయించడం వల్ల రైతులకు బాగా నష్టం జరగుతుందని ఆ లేఖలో ప్రస్తావించారు.
ఈ కారణం చేత తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్ గెలల ధర నిర్ణయించేందుకు ఈ పాత పద్ధతినే పాటిస్తోందన్నారు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని ముడి పామాయిల్ ధరలు స్థిరీకరించడానికి దిగుమతి సుంకం తిరిగి విధించి దేశీయ పామాయిల్ రైతులను ప్రోత్సహించడం కోసం ముడి పామాయిల్ దిగుమతి సుంకంపై సమగ్రమైన విధివిధానాలను రూపొందించాలని సూచించారు. రాష్ట్ర ఆయిల్‌పామ్ రైతులు, కంపెనీలను కలుపుకుని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సూత్రాన్ని తిరిగి సమీక్షించి రైతులకు పామాయిల్ గెలల ధరలు మంచి లాభసాటిగా ఉండేలా నిర్ణయించి పంట సాగు విస్తీర్ణం పెంచడానికి రైతులను ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
అతి త్వరలో రైతు రుణమాఫీపై శుభవార్త : తుమ్మల
రైతులకు ఎట్టిపరిస్థితుల్లో ఎరువుల కొరత రాకూడదు : మంత్రి తుమ్మల