Minister Tummala Fires On Irrigation Department officials : మీ వైఫల్యమే పెద్దవాగు ప్రాజెక్టుకు శాపంగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటి పారుదల శాఖ అధికారులపై మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలో ఉన్న పెద్ద వాగు ప్రాజెక్ట్‌కు గురువారం రాత్రి గండి పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సందర్శించారు.
ప్రాజెక్ట్ గండిపడటానికి ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యమే కారణమని తుమ్మల అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తాయని, పైనుంచి వరద వస్తుందని ముందుగానే వార్తాపత్రికలు, టీవీలు చెప్తున్నా ఎందుకు మేల్కోలేదని అధికారులను నిలదీశారు. 18వ తేదీ ఉదయమే ప్రాజెక్టుకు ఉన్న మూడు గేట్లను పూర్తిగా ఎత్తి, నీటిని విడుదల చేస్తే ఈ దుస్థితి ఎదురయ్యేది కాదని అన్నారు.
"ఈ ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినది. ఏపీ 80 శాతం, తెలంగాణ నుంచి 20 శాతం నిధులు ఈ ప్రాజెక్ట్‌కు కేటాయించాలి. గతంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఫోకస్ పెట్టలేదని క్లియర్‌గా తెలుస్తోంది. అంతేకాకుండా అధికారుల నిర్లక్ష్యం ఉందని చాలా మంది రైతులు చెబుతున్నారు. ఇకపై ఎటువంటి వరద పోటెత్తినా తట్టుకునేటట్టుగా, అవసరమైతే మరిన్ని గేట్ల నిర్మాణాలు చేపడతాం."-తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రి
ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటా : పర్యవేక్షణ అధికారులు ప్రాజెక్టు వద్దకు జులైలో వెళ్లి గేట్లు పైకి లేస్తున్నాయో లేదో ట్రయల్ వేయాల్సి ఉన్నా, ఆ పని చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రూ.వందల కోట్ల నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో వరదలపై సమీక్ష జరిపారు. అంతకుముందు పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడటంతో పొలాల్లో వేసిన ఇసుక మేటలు, రాళ్ల కుప్పలను పరిశీలించారు.
అంతేకాదు వరద కారణంగా నీట మునిగిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగు ప్రాజెక్ట్ విషయమై ఇరు రాష్ట్రాలు కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వరదలకు తట్టుకునే విధంగా అధిక సామర్థ్యం నీటి నిలువు ఉండే విధంగా ప్రాజెక్టును పునర్నిర్మాణం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి తుమ్మల రైతులకు హామీ ఇచ్చారు.
తెలంగాణలో రికాం లేని వానలు - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - Heavy Rains Across Telangana