Minister Sridhar Babu on Musi River Development : రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ పారిశ్రామికవేత్తల సహకారాన్ని కోరింది. వారి సలహాలు, సూచనలు తీసుకున్నాకే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వంలో చేసిన పనులను అడ్డుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, సీఐఐ చేపట్టిన తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్-2050ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మౌలిక రంగంతో పాటు స్థిరాస్తి రంగం కూడా అభివృద్ధిలో భాగమేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చే ఐదేళ్లు కాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాలతో రాష్ట్ర ప్రగతిని కోరుకుంటుందన్నారు. అందులో పారిశ్రామిక వేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వం దుబారా ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది : శ్రీధర్‌బాబు
సీఐఐ ఛైర్మన్ శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో శ్రీధర్ బాబుతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, సీఐఐ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ తన 2050 ప్రణాళికను వివరించింది. వినూత్నమైన ఆలోచనలు, సాంకేతిక అనుభవంతో వచ్చే సంస్థలకు అవకాశాలు దక్కుతాయని సూచించింది. అనంతరం రాష్ట్ర, నగర అభివృద్ధి ప్రణాళికను సీఐఐ ప్రతినిధులతో పంచుకున్న మంత్రి శ్రీధర్ బాబు, మూసీ నది అభివృద్ధే లక్ష్యంగా నగరంలో పని చేయబోతున్నట్లు వివరించారు. వికారాబాద్ నుంచి నగరంలో 55 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ప్రజల రవాణా, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతో పాటు పరివాహక ప్రాంత చిరు వ్యాపారులకు కూడా లబ్ధి చేకూరేలా మూసీ నదిని పర్యాటకంగా, సాంస్కృతికంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.
జిల్లాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు రావట్లేదో అధ్యయనం చేస్తాం : శ్రీధర్‌బాబు
అది చేసి చూపించాం - ఇదీ చూపిస్తాం : ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి శ్రీధర్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాంతీయ వలయ రహదారి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధానిని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. కానీ రాష్ట్రప్రభుత్వం అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. అయినా సరే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర నిధులతోనే మూడు దశలుగా అభివృద్ధి చేయనున్నట్లు శ్రీధర్ బాబు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ వైపే అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయని, జపాన్, రష్యా, చైనా లాంటి దేశాలు కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. కానీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లుతుందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలు ఎవరైనా ముఖ్యమంత్రితో పాటు అధికారులను స్వేచ్ఛగా కలవొచ్చని సూచించారు.
నెల రోజులు కాకుండానే కాంగ్రెస్‌పై బురద జల్లడం సరికాదు : మంత్రి శ్రీధర్ బాబు
ఈ సదస్సులో మౌలిక, స్థిరాస్తి రంగంలో సాంకేతికత, సుస్థిరాభివృద్ధి, రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, పట్టణీకరణలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడుల ప్రణాళికలపై సీఐఐ ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు.
అధికారులు సమర్థవంతంగా పని చేసి లక్ష్యాలు సాధించాలి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు