Minister Sridhar Babu on Investments In Telangana : ప్రతిపక్షాలు పెట్టుబడులపై చేస్తున్న దుష్ప్రచారం తగదని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. కొన్ని కంపెనీలు వారి విధానాల ప్రకారం ప్లాంట్లను విస్తరించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అన్నారు. సచివాలయంలో ఇష్టాగోష్టిలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏసీ సిటీ గురించి ఫ్యూచర్ సిటీలో చర్చించినట్లు వివరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలి వచ్చి ఉపాధిని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
"రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. పెట్టుబడులకు రాష్ట్రంలో మంచి వాతావరణం ఉందని వివరించేందుకు విదేశాలకు వెళ్లాం. రాబోయే 20 ఏళ్లపాటు కాంగ్రెస్ లక్ష్యం, గమ్యం ఏమిటో పలు సంస్థలకు వివరించాం. దక్షిణకొరియాలో అనేక కంపెనీలతో చర్చలు జరిపాం. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం" అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
విదేశాల్లో పెట్టుబడుల కోసం పర్యటించిన రేవంత్ బృందం 19 సంస్థలతో రూ.31,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసిందని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణపై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో చర్చించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడులతో 30,750 ఉద్యోగాలు వచ్చేలా ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. దక్షిణ కొరియాలో దాదాపు 12 సంస్థలతో చర్చలు జరిపామన్న ఆయన, మూసీ పునరుజ్జీవనం కోసం కొన్ని అధ్యయనాలు చేశామని తెలిపారు.
"ఏఐ, సెమీ కండక్టర్ల తయారీలో దిగ్గజ సంస్థలతో గంటలకొద్దీ చర్చలు జరిపాం. ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతోనూ చర్చలు జరిపాం. కొన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాలు తరలివెళ్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. కొన్ని కంపెనీలు వారి విధానాల ప్రకారం ప్లాంట్లను విస్తరిస్తాయి. కార్నింగ్ సంస్థ కంపెనీ విస్తరణపై కొత్తగా ఒప్పందం చేసుకుంది. కాగ్నిజెంట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి." - శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి
జీనోమ్ వ్యాలీలో ఫాల్కనెక్స్ కంపెనీ విస్తరణకు ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మెగా ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హ్యుందాయ్ కంపెనీ ముందుకు వచ్చిందన్న ఆయన హైదరాబాద్‌లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేస్తామని యంగ్‌వన్ కంపెనీ ముందుకువచ్చిందని వివరించారు. ఎల్‌ఈడీ స్క్రీన్ల ఆర్ అండ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సీటెక్ సంస్థ చెప్పిందని వెల్లడించారు.
హైదరాబాద్‌లో కేపబులిటీ సెంటర్ - జొయిటిస్ కంపెనీతో సీఎం రేవంత్ చర్చలు