Minister Sandhyarani Fire on Tribal Student Father Insulting Incident: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని మోడల్ స్కూల్లో ఓ గిరిజన విద్యార్థి తండ్రిని చొక్కా విప్పి అవమానించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన మంత్రి సంధ్యారాణి పాఠశాల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై తక్షణ చర్యలపై అధికారులను ఆదేశించారు.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్లో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కువ మండలంలోని మోడల్ స్కూల్లో ఇటీవల తనకు అవమానం జరిగిందని ఓ విద్యార్థి తండ్రి వినతిపత్రం అందజేశారు. పాఠశాలల కమిటీ ఎన్నికల్లో తన చొక్కా విప్పి అవమానించారని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. రెండు గంటలపాటు చొక్కా విప్పతీసి నిలబెట్టారని, అందుకు హోంగార్డు కూడా సహకరించారని ఆవేదన వెలిబుచ్చాడు.
దీనిపై స్పందించిన మంత్రి సంధ్యారాణి ఓ గిరిజనుడిని చొక్కా విప్పదీసి రెండు గంటలపాటు నిలబెట్టడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజనుడిని నిలబెట్టిన సమయంలో హోంగార్డు సహకారం ఉందని సంబంధిత హెచ్ఎం హోంగార్డుపై చర్యలు తీసుకోవాలన్నారు.