Minister Posts for TDP Leaders Faced Harassment from YSRCP Govt : వైఎస్సార్సీపీ ప్రభుత్వ వేధింపులే కొంత మందికి తెలుగుదేశం నాయకులకు మంత్రి పదవులు దక్కడానికి హేతువయ్యాయి. వైఎస్సార్సీపీ అరాచకాలు, దుర్మార్గాలు, దమనకాండలు, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడిన పలువురు నాయకులను జగన్ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. వారి ఆర్థిక మూలాల్ని దెబ్బతీసింది. ఒక్కొక్కరి పైనా పదుల అక్రమ కేసులు బనాయించింది. జైల్లోనూ పెట్టింది. కష్ట కాలంలోనూ వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం గట్టిగా నిలబడ్డ నాయకులను మంత్రి పదవులు వరించాయి.
అటు అసెంబ్లీలోనూ, ఇటు బయటా జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగడుతున్నారనే కక్షతో అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ (ESI) మందుల కొనుగోలులో కుంభకోణం పేరిట అక్రమ కేసు బనాయించారు. రాత్రివేళ ఆయన్ను అరెస్టు చేశారు. అప్పటికి ఒకరోజు ముందే పైల్స్ శస్త్రచికిత్స చేయించుకున్నా వదల్లేదు. రక్తస్రావం అవుతున్నా అత్యంత అమానవీయంగా ఆయన్ను రోడ్డు మార్గంలో కొన్ని గంటలపాటు వాహనంలో తిప్పి శ్రీకాకుళం నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. కొన్ని రోజుల పాటు జైల్లో నిర్బంధించారు. ఇలా అచ్చెన్నపై 21 కేసులు పెట్టారు. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు.
తెలుగుదేశాన్ని వీడి వైఎస్సార్సీపీలోకి చేరమంటే ఒప్పుకోలేదని గొట్టిపాటి రవికుమార్ ఆర్థిక మూలాలపై జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బకొట్టింది. వివిద శాఖల అధికారులతో ఆయన గ్రానైట్ క్వారీలపై దండయాత్ర చేయించింది. క్వారీలన్నింటినీ మూయించేసింది. ఆయన సంస్థలపై మొత్తం 60కి పైగా కేసులు పెట్టింది. దాదాపు రూ. 280 కోట్లలకు పైగా జరిమానాలు విధించింది. అయినా వెనక్కి తగ్గని గొట్టిపాటి రవికుమార్ కోర్టుల్లో న్యాయపోరాటం చేశారు. పార్టీ తరఫున గట్టిగా నిలబడ్డారు.
తెలుగుదేశానికి వివిధ రూపాల్లో అండగా ఉంటున్నారనే కారణంతో పొంగూరు నారాయణపై జగన్ ప్రభుత్వం కేసులతో ముప్పేట దాడి చేసింది. చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ విషయంలో నారాయణకు సంబంధాన్ని ఆపాదించి అరెస్టు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు తదితర అంశాల్లో సీఐడీతో కేసులు పెట్టించి విచారణ పేరిట వేధించింది. నారాయణ వాటన్నింటినీ తట్టుకుని పార్టీ కోసం నిలబడ్డారు.
వైఎస్సార్సీపీ ఫ్యాక్షన్ పాలనకు కొల్లు రవీంద్ర ప్రధాన బాధితుడు. ఆయనపై 25 కేసులు బనాయించారు. సంబంధం లేని హత్య కేసులో ఆయనను ఇరికించి అరెస్టు చేశారు. 2 నెలల పాటు ఆయన జైల్లో గడపాల్సి వచ్చింది. ముందస్తు నిర్బంధం (PD-Preventive Detention) పేరిట ఆయన్ను అదుపులోకి తీసుకుని ఇబ్బందులకు గురిచేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా అనేక కేసులు పెట్టారు. అయినా రవీంద్ర పార్టీనే నమ్ముకుని పనిచేశారు.
నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలిచారన్న అక్కసుతో బీసీ జనార్దన్‌రెడ్డిపై ఎడాపెడా కేసులు పెట్టారు. అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించి నెల రోజులకుపైగా జైల్లో ఉంచారు. బనగానపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకలాపాలు చేసుకోనివ్వకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. వాటన్నింటినీ తట్టుకుని జనార్దన్‌రెడ్డి పార్టీ కోసం నిలబడ్డారు.
మంత్రివర్గం కూర్పులో చంద్రన్న మార్క్- సామాజిక న్యాయానికి పెద్దపీట - AP New Cabinet Ministers List
నిమ్మల రామానాయుడు తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేతగా దీటుగా పనిచేశారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎన్ని విధాలుగా కవ్వించినా తట్టుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలతో కలిసిపోయి పనిచేశారు. అవన్నీ ఆయనకు కలిసొచ్చాయి. ఇక వంగలపూడి అనిత తెలుగుమహిళ అధ్యక్షురాలిగా క్రియాశీలకంగా వ్యవహరించి వైఎస్సార్సీపీ తీరును ఎండగట్టారు. ఆమెపై వైఎస్సార్సీపీ మూకలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశాయి. చివరకు దళితురాలైన ఆమె పైనే ఎట్రాసిటీ కేసు పెట్టారు. అటు డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో దీటుగా వ్యవహరించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. వీరందరికీ మంత్రి పదవులు వరించేందుకు ఈ అంశాలు దోహదపడ్డాయి.
చంద్రబాబు టీం - కొత్త మంత్రుల వివరాలు - Andhra Pradesh Ministers details