Prakasam Barrage Boats Incident: ప్రకాశం బ్యారేజీని 5 బోట్లు ఢీకొన్న ఘటన రోజుకో మలుపుతిరుగుతోంది. ఈ ఘటనలో కుట్ర కోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని తెలిపారు. 40, 50 టన్నుల బరువు ఉన్న పడవలు 67, 69, 70 గేట్లను దాటి కౌంటర్ వెయిట్‌లను బలంగా ఢీకొట్టాయన్నారు. అదృష్టవశాత్తు బ్యారేజ్‌కి సంబంధించిన ప్రధాన కట్టడం, గేట్లకు ఇబ్బంది లేకుండా ఉందన్నారు.
బ్యారేజీని ఢీకొన్న పడవల్లో ఒకే యజమానికి చెందిన 3 బోట్లు ఉన్నాయన్నారు. లంగర్ వేయకుండా 3 బోట్లను ప్లాస్టిక్ తాడుతో కట్టారన్న మంత్రి నిమ్మల, బోటు యజమాని వైఎస్సార్సీపీ నేత కావడం కుట్రకోణాన్ని బలపరుస్తోందన్నారు. నందిగం సురేష్, తలశిల రఘురామ్‌కు బోటు యజమాని ఉషాద్రి రామ్మోహన్ దగ్గరి మనిషి అని, అంతే కాకుండా బోట్లకు వైఎస్సార్సీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
ఉద్దండరాయినిపాలెం వైపు ఉండే బోట్లు వరదకు ముందే ఇవతలికి వచ్చాయన్న నిమ్మల, దాదాపు కోటిన్నర విలువ చేసే బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అని అనుమానం వ్యక్తం చేశారు. నది ఒడ్డున లంగర్ వేసుకుని జాగ్రత్తగా పడవలు ఉంచుతారని, ఇంత బరువు ఉన్న పడవలను ప్లాస్టిక్ తాడుతో కట్టేస్తారా అని ప్రశ్నించారు. మూడు పడవలను కలిపేసి ప్లాస్టిక్ తాడుతో లంగర్ వేస్తారా అని అనుమానం వ్యక్తం చేసిన నిమ్మల, ఉద్దేశపూర్వకంగానే చేశారన్న అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారన్నారు.
రాజధానిపై ద్వేషంతో గతంలో అరటి తోటలు తగలపెట్టడం, సొంత బాబాయ్‌ని కూడా హత్య చేసిన చరిత్ర వైఎస్సార్సీపీ నేతలదని విమర్శించారు. పైస్థాయి ఆదేశాలు లేకుండా విలువైన బోట్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండరన్నారు. వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగేవని నిర్ధారణవుతోందన్న నిమ్మల, అనుమానాలను బలపరిచేలా ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయటకొస్తున్నాయన్నారు. బ్యారేజ్‌కి కూడా హాని తలపెట్టేలా కుట్ర పన్నారా అనే కోణంలో విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. దీని వెనుక ఉన్న అనుమానాలు, ఇతర కారణాలపై దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు.
Report on Prakasam Barrage Boats Hit: ప్రకాశం బ్యారేజీvf బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం ఉందని అంతర్గత విచారణ నివేదిక ఇప్పటికే వెల్లడించింది. బోట్లు తమవని ఎవరూ రాకపోవడమే కుట్ర కోణం ఉందనడానికి నిదర్శనమని, బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలవని నివేదికలో నిర్ధారించారు. తలశిల రఘురాం, నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు, ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్ ఉషాద్రి బోట్లనే వినియోగించేవారని తెలిపారు.
బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించారు. వీటిని ఉషాద్రి, కర్రి నరసింహస్వామి, గూడూరు నాగమల్లేశ్వరి బోట్లుగా గుర్తించిన అధికారులు, ఉషాద్రికి చెందిన 3 బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్రకోణం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఇనుప గొలుసుతో లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో బోట్లను కట్టేశారని, సెప్టెంబర్ 2న 5 బోట్లు బ్యారేజ్ గేట్లను ఢీకొట్టినట్టు నివేదికలో స్పష్టం చేశారు. నిందితుల కాల్‌డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ముందస్తు కుట్రతోనే ఇలా చేసి ఉంటారని విచారణ అధికారులు భావిస్తున్నారు.