Minister Narayana on Environment Conservation in AP : రాష్ట్రంలో తీరప్రాంత అభివృద్ది, పర్యావరణ రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. దేశంలోనే అత్యధికంగా దాదాపు 972 కిలో మీటర్ల మేర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. తీర ప్రాంతాన్ని అభివృద్ది చేస్తే ద్వారా పరిశ్రమలు రావడంతో పాటు యువతకు ఉద్యోగ, అవకాశాలు వస్తాయని చెప్పారు.
సూర్యలంక బీచ్‌కు మహర్దశ - రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం - Suryalanka Beach Development
విశాఖ పట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం - కాకినాడ పెట్రోలియం అండ్ ప్రెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇక శ్రీసిటీలో భాగమైన విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులను కూడా అభివృద్ది చేసినట్లు చెప్పారు. తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ది చేసేలా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. తీర ప్రాంతంలో నివసించే జనాభాలో చాలా మంది చేపలు పట్టడం, వ్యవసాయంతో పాటు సాంప్రదాయ వృత్తుల ద్వారా జీవనోపాధి పొందుతున్నారని వివరించారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, సముద్ర కోత కారణంగా చాలా మేర తీరప్రాంతం కొతకు గురవుతుందని చెప్పారు. భారతీయ సాంప్రదాయ జ్ణానం, సాంకేతికత ఉపయోగించి ప్రకృతి వైపరీత్యాలు వంటి సవాళ్లను అధిగమించేలా సదస్సులో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. 2024 కేంద్ర బడ్జెట్లో కూడా ఇలాంటి సవాళ్లను అధిగమించడం కోసం ఏపీకి కేటాయింపులు చేయడం కూడా మంచి పరిణామమన్నారు.
తీర ప్రాంతాన్ని ఎలా అభివృద్ది చేయాలి? : మన దేశంలో తీర ప్రాంతం ఎంతో ఉందని, మన మేదస్సుకు పదును పెట్టి దానిని అభివృద్ది చేసుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్ధులు, ఆర్కిటెక్చర్లు విచ్చేశారని వివరించారు. ఇలాంటి సవాళ్లను అధిగమించేందుకు కేవలం నిపుణులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే కాకుండా ఆర్కిటెక్ట్ విద్యార్ధులు కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. తీర ప్రాంతాన్ని ఎలా అభివృద్ది చేయాలనే అంశాలను తాము సర్వే చేసి ఆ వివరాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నామని విద్యార్ధులు అంటున్నారు. దేశాభివృద్దికి ఎంతో కీలకంగా ఉన్న తీర ప్రాంతం లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంపునకు కూడా ఉపయోగపడతాయని అన్నారు.