Minister Narayana on Amaravati : రాజధానిలో అంగన్వాడీ, ఈ-హెల్త్ సెంటర్లు, స్కూళ్లు, శ్మశానాలు ఇలా 48 రకాల పనుల్ని ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తి చేసి సీఎం చంద్రబాబుతో ప్రారంభం చేయిస్తామని పట్టణాభివృద్దిశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ నుంచి వీలైనంత మేర రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని నారాయణ స్పష్టం చేశారు.
Narayana Visit Amaravati Villages : అంతకుముందు నారాయణ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. అమరావతిలోని పలు గ్రామాల్లో సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్ట్ కింద అభివృద్ది పనులు జరుగుతున్నాయని నారాయణ తెలిపారు. ఆయా పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. వచ్చే నెలాఖరులోపు అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 24 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని నారాయణ పేర్కొన్నారు.
ఇందులో భాగంగా 14 ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, 17 అధునాతన అంగన్వాడీ సెంటర్లు నిర్మిస్తున్నట్లు నారాయణ వివరించారు. 16 ఈ- హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, ఒక బహుళ అత్యాధునిక పర్యావరణ శ్మశాన వాటిక నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు. ఇవన్నీ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని నారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.