Minister Nara Lokesh Review On Education Officials : 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సూచించారు. అంతర వర్సిటీ క్రీడా పోటీల నిర్వహణ, క్రీడా విశ్వవిద్యాలయం నివేదిక సిద్ధం చేయాలని తెలిపారు. ఉండవల్లి నివాసంలో లోకేశ్ ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని ఇందుకు తగ్గట్లుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌లో మార్పులు చేయాలని సూచించారు.
ఉద్యోగాలు లభించేలా నైపుణ్య శిక్షణ : కళాశాలల్లో చదువుతున్నప్పుడే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని లోకేశ్ తెలిపారు. బయట మళ్లీ శిక్షణ తీసుకునే పరిస్థితి ఉండకూడదని కంప్యూటర్ సైన్సు, మెకానికల్ లాంటి వాటితో పాటు సివిల్స్ శిక్షణ అంతర్భాం చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. పరిశ్రమల యాజమాన్యంతో చర్చించి, వారి అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయాల ర్యాంకుల మెరుగుకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు.
మెరుగైన ర్యాంకులు సాధించాలి : 2027 నాటికి మెరుగైన ర్యాంకుల కోసం ప్రతి వర్సిటీ లక్ష్యాన్ని నిర్దేశించాలని ఆంధ్ర, ఆచార్య నాగార్జున వర్సిటీలు టాప్-10లో ఉండాలని లోకేశ్ ఆకాంక్షించారు. రాష్ట్ర వర్సిటీల్లో చదివి కీలక స్థానాల్లో ఉన్న అల్యూమినీ ప్రముఖలతో వెబ్‌సైట్ రూపొందించి, బ్రాండింగ్ కల్పించాలని పేర్కొన్నారు. అవసరమైతే ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖులతో తాను ప్రత్యేకంగా సమావేశమవుతానని మంత్రి వెల్లడించారు. 2030, 2047 నాటికి వర్సిటీల్లో ప్రమాణాల మెరుగుకు లక్ష్యాలను నిర్దేశించాలని స్పష్టం చేశారు. వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు తక్షణమే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ నాయకులు వేధిస్తున్నారు - మంత్రి లోకేశ్‌కు బాధితుల మొర - Nara Lokesh Praja Darbar
ప్రతి నెలా జాబ్ మేళాకు క్యాలెండర్ : గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 2,473 కోట్ల పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల అంశాన్ని నేడు జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. వచ్చే ఏడాది (2025-26) నుంచి జరిగే ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. పరిశోధన-సృజనాత్మకత, ఉపకులపతుల నియామకానికి వస్తున్న దరఖాస్తులు, పారిశ్రామికవేత్తలతో వర్సిటీల బోర్డు ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు వంటి అంశాలపైన లోకేశ్ సమీక్షించారు. నియోజకవర్గాల వారీ ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహించేందుకు క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచించారు.
సీబీఎస్ఈ రగడ - ఎక్స్ వేదికగా నారా లోకేశ్ Vs వైఎస్ జగన్ - Nara Lokesh Counter to YS Jagan