Nara Lokesh Praja Darbar : వారసత్వంగా సంక్రమించిన భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేశారంటూ కొందరు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ మరికొందరు. అనారోగ్యంతో మంచాన పడ్డ కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ ఇంకొందరు మంత్రి లోకేశ్‌కు వినతులు సమర్పించారు. ఉండవల్లిలోని మంత్రి నివాసంలో 40వ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కు వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చి సమస్యలు విన్నవించారు.
వారసత్వంగా సంక్రమించిన తమ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని సత్యసాయి జిల్లా నామాల గ్రామానికి చెందిన బుక్కపట్నం రమణమ్మ మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేసింది. 10వ తరగతి వరకు చదువుకున్న తమ కుమారుడికి ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించి తమల్ని ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన సీహెచ్ ఆరోగ్యరావు విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న తాను ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డానని, వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని నూతక్కికి చెందిన వి.కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వ అధికార అండతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి తాము కొనుగోలు చేసిన స్థలాన్ని కబ్జా చేశారని కృష్ణా జిల్లా బట్లపెనుమర్రుకు చెందిన సంగిశెట్టి వెంకట సీతారావమ్మ, మాచర్ల విజయలక్ష్మి, మునగాల మాధవి మంత్రి నారా లోకేశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. గతేడాది విజయవాడ బస్‌స్టేషన్‌లో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులపై బస్సు దూసుకొచ్చిన ఘటనలో తన 6 నెలల కుమారుడు మరణించాడని, ఆ మనోవేదనతో ఉద్యోగం కోల్పోయానని బాపట్ల జిల్లా పంగులూరుకు చెందిన కాటి యల్లమంద కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ జీవనం కోసం ఉద్యోగం కల్పించడంతో పాటు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్సీపీ నాయకులు వేధిస్తున్నారు - మంత్రి లోకేశ్‌కు బాధితుల మొర - Nara Lokesh Praja Darbar
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా అసిస్టెంట్ ఇంజనీర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏలూరు జిల్లా పెదవేగికి చెందిన రాజబోయిన సీతమ్మ మంత్రి లోకేశ్‌కు వినతిని సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, వారికి అన్ని విధాల అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్‌లో వినతులు సమర్పించిన బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కారించడానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.