Lokesh Speech in Visakha CII Summit : ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని జిల్లాల్లో ఇండ్రస్టీస్‌కు అనువైన వాతావరణం ఉందన్నారు. విశాఖ రీజియన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
గ్రీన్ ఎనర్జీ విషయంలో రాష్ట్రంలో మంచి విధానం అందుబాటులోకి తెచ్చామని లోకేశ్ చెప్పారు. అన్ని జిల్లాలకు ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ హబ్‌గా విశాఖపట్నం రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఆర్థికాభివృద్ధి బోర్డు ఒక యువ ఐఏఎస్ అధికారి నేతృతంలో పనిచేస్తోందని చెప్పారు. యువ నిపుణులతో మంచి ఫలితాలు రానున్నాయని పేర్కొన్నారు. విశాఖను ఆర్థిక నగరంలో 9 నుంచి 5వ స్థానానికి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. భోగాపురం విమానశ్రయాన్ని త్వరలోనే అందుబాటులోకి వస్తుందని లోకేశ్ వెల్లడించారు.
"గత ఐదేళ్లలో అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధిని మళ్లీ పట్టాలు ఎక్కిస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకించి ఐటీ కంపెనీలపై దృష్టి సారించాం. యువతకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పిస్తాం. రాష్ట్రంలో డేటా సెంటర్లకు ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఐటీ రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు ఉన్నాయి. 2019కు ముందు ఎన్నో సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. గత ప్రభుత్వం ఆ ఒప్పందాలను పక్కన పెట్టింది." - లోకేశ్, మంత్రి
'ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు సుముఖంగా ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి మండలిని పునరుద్ధరిస్తాం. గత ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగింది. పాత ఐటీ మంత్రి కోడిగుడ్లు గురించే మాట్లాడారు ఐటీ గురించి మాట్లాడలేదు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షిస్తున్నాం. గతంలో లూలూ గ్రూపును పెట్టుబడులకు ఒప్పించాం. వైఎస్సార్సీపీ సర్కార్ లూలూ గ్రూపును నిర్లక్ష్యం చేసింది' అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
Lokesh on Vizag Steel Plant Issue : స్టీల్‌ప్లాంట్ అంశంపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని లోకేశ్ విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగనీయబోమని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పారని గుర్తుచేశారు. పాదయాత్ర సమయంలో తాను కూడా అదే చెప్పినట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో విశాఖ ఉక్కుకు ఏ కొంచెమైనా సాయం జరిగిందా అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ యోచనే లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ మాత్రం ప్రతిరోజూ ఎక్స్‌లో పోస్ట్ పెడుతుందని ఆక్షేపించారు. ఇంకా వాళ్లకు బుద్ధిరాలేదని లోకేశ్ వ్యాఖ్యానించారు.
తిరుమల లడ్డూపై సిట్ వేశామని అన్ని విషయాలు బయటకు వస్తాయని లోకేశ్ తెలిపారు. దీనిపై సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందని ఓ రిపోర్టర్ ఆయణ్ని అడిగారు. ఈ ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ మరి బాబాయ్ హత్యపై వైఎస్ సునీత సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌తో పూర్తిగా నాణ్యతను గాలికి వదిలేశారని విమర్శించారు. 24 గంటలపాటు తాను తిరుపతిలోనే ఉన్నానని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి చెప్పినా ఎందుకు రాలేదని లోకేశ్ నిలదీశారు.