Minister Nadendla Manohar Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌కి లక్ష టన్నుల కంది పప్పు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత వేదిస్తున్నా ఏపీలో కిలో కంది పప్పు రూ.150 అందిస్తున్నామన్నారు. నవంబర్ నాటికి కందిపప్పు సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. గిడ్డంగుల నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో సింహభాగం ఇవ్వాలని కోరామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర మార్కెటింగ్ శాఖలు నిర్వహించే ప్రైస్ మానిటరింగ్ సెంటర్లను ప్రస్తుతం ఉన్న 5 నుంచి 13కు పెంచాలని కోరామన్నారు.
దిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, హర్దీప్ సింగ్ పూరిలతో నాదెండ్ల భేటీ అయ్యారు. అనంతరం ఆంధ్ర భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, విభజన వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఎన్ఎఫ్ఎస్ఏఏ ప్రకారం రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా 2001 సెన్సెస్ ప్రకారం కేటాయించారని తెలిపారు. దీంతో ఏపీకి రేషన్ కార్డులు బాగా తగ్గిపోయాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు ఆటంకం లేకుండా ప్రతి నెలా రేషన్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.
అదే విధంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న 60 లక్షల దీపం కనెక్షన్లను పీఎం ఉజ్వల యోజన పథకం కింద వచ్చే విధంగా మార్పిడి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. పౌరసరఫరాల శాఖకు రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరామన్నారు. పీఎం ఉజ్వల యోజన కింద ఏపీకి ఆరు శాతం గ్యాస్ కనెక్షన్లే ఇచ్చారని, అదనపు నిధులు కేటాయించి గ్యాస్ కనెక్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రేషన్ డోర్ డెలివరీపై కేబినెట్లో చర్చిస్తాం: రేషన్ డోర్ డెలివరీ అంటూ వైసీపీ ప్రభుత్వం రూ.1800 కోట్లు వృథా చేసిందని, రేషన్ డోర్ డెలివరీపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అర్హత ఉన్నవారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించారు. రేషన్ బియ్యాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం జరిగిందన్న నాదెండ్ల, రైతుల నుంచి పంట సేకరించి డబ్బు ఇవ్వలేదని ఆరోపించారు.
గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.1674 కోట్లను రైతులకు చెల్లిస్తున్నామని, ఇప్పటికే రూ.1000 కోట్లు ఇచ్చామన్నారు. మిగిలిన రూ.674 కోట్లను త్వరలోనే రైతులకు చెల్లించబోతున్నామని, ఏపీకి విభజన వల్ల నష్టం జరిగిందన్నారు. న్యాయం చేయాలన్న భావన కేంద్ర పెద్దల్లో కనిపిస్తుందని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు తెలిపేందుకు ఎంపీలు, అధికారులు వారి సహకారాన్ని అందించారని తెలిపారు. రాష్ట్ర అంశాల పరిష్కారానికి కేంద్రం సుముఖంగా ఉందన్నారు.
వైసీపీ పెద్దల లాభం కోసమే జగనన్న కాలనీలు : మంత్రి నాదెండ్ల మనోహర్ - problems of Jagananna colonies
వైఎస్సార్సీపీకి అధ్యకుడెవరో తెలియదు: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలో వైఎస్ జగన్ చెప్పాలని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఇంటింటికీ రూ.4 వల పన్షన్ ఇచ్చినందుకా? పోలవరం పనులు మొదలుపెడుతున్నందుకా? కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సహకారం తీసుకువచ్చినందుకా? అని నిలదీశారు. జగన్ కోటల్లో ఉంటారని, ప్రజలు బతుకులు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసా అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రపతి పాలన పెట్టాలని అనడం సరికాదని మండిపడ్డారు.
తాడు బొంగరం లేని పార్టీ: జగన్ పద్దతి మార్చుకోవాలని, ప్రతిపక్ష హోదా లేదు, భద్రత తగ్గించారు వంటివి కాకుండా ప్రజల పక్షాన నిలబడాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ తాడూ బొంగరం లేని పార్టీ అని, ఎలక్షన్ కమిషన్‌లో ఆ పార్టీకి సభ్యత్వం లేదన్నారు. ఇంతవరకు ఆ పార్టీకి అధ్యక్ష ఎన్నికలే జరగలేదని, అధ్యక్షుడు ఎవరో? ప్రధాన కార్యదర్శి ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. అసలు పార్టీ ఎవరిదో క్లారిటీ లేదని, ముందు జగన్ తన పార్టీని చక్కదిద్దుకుని మిగతావారిని విమర్శించాలన్నారు. ఏపీలో 'సూపర్ సిక్స్' పథకాలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్న నాదెండ్ల, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేసి తీరుతామన్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నాదెండ్ల క్లారిటీ: అడవుల పరిరక్షణలో భాగంగా సినిమా హీరోలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ చేసిన వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. పవన్ కల్యాణ్ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించరని, పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు పెంచాలనే ప్రత్యేక కార్యాచరణతోనే అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కల్యాణ్ సమావేశం - Pawan Kalyan Meet Karnataka CM