Minister Mandipalli on peddireddy Land Grabbing: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో పెద్దఎత్తున భూదోపిడీ జరిగిందని, పెద్దిరెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూఅక్రమాలకు పాల్పడిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. లక్షన్నర ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని ఆక్షేపించారు.
పెద్దిరెడ్డి కుటుంబం 14 మండలాల్లో ఏకంగా 15 నుంచి 20 వేల ఎకరాలు దోచినట్లు తెలుస్తోందని తెలిపారు. భూ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా స్పందించి విచారణకు ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. పెద్దిరెడ్డి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలను దహనం చేశారన్నారు. కుట్రలో కొందరు అధికారులు కూడా భాగస్వాములుగా ఉన్నారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం కొందరు అధికారులు పనిచేశారని ఆరోపించారు.
సెక్యురిటీ కోసం చిల్లర రాజకీయాలు .. భద్రత కోసం పెద్దిరెడ్డి కుటుంబం చిల్లర రాజకీయాలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు. కావాలనే దాడుల సృష్టించుకుని, పోలీసుల వైఫ్యలం పేరుతో డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా పుంగనూరులో చేసిన భూదోపిడీ గురించి స్థానికులు నిలదీస్తుంటే, దాన్ని దాడిగా చూపించి హైకోర్టులో భద్రత కోరడం సరికాదన్నారు.
భూఅక్రమాలపై ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశారని, రూ.40 వేల కోట్ల విలువైన 1.3 లక్షల ఎకరాల భూఅక్రమాలు జరిగాయని మంత్రి స్పష్టం చేశారు. భూదోపిడీ జరిగిన ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ దాడులు జరుగుతున్నాయని, పులిచర్ల మండలంలోనే 900 ఎకరాలు బయటపడిందని తెలిపారు. పెద్దిరెడ్డి భార్య పేరిట మదనపల్లె బైపాస్ వద్ద ఐదెకరాలు ఉన్నట్లు తేలిందన్నారు.
పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె క్వారీలు వదిలేసి వెళ్లారని, క్వారీల్లో ఒకే పేరుతో పలు యంత్రాలు, వాహనాలున్నాయన్నారు. వాహనాలను పొరుగు రాష్ట్రాల్లో గోదాముల్లో దాచినట్లు సమాచారం ఉందన్న మంత్రి, కుటుంబ వివాదాల్లోనూ జోక్యం చేసుకుని అన్యాయం చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో చాలా మంది టీడీపీ నేతల గన్‌మెన్లను తొలగించారని ధ్వజమెత్తారు. మంత్రితో పోల్చితే ఎమ్మెల్యేకు ఇచ్చే భద్రత తగ్గుతుందని తెలిపారు.
"వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగింది. లక్షన్నర ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం 15 నుంచి 20 వేల ఎకరాలు దోచింది. మదనపల్లి సబ్ కలెక్టరేట్ దహనం వెనుక కుట్ర దాగి ఉంది. కొందరు అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం చేశారు". - రాంప్రసాద్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి