Minister Kondapalli Srinivas Press Meet: కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టిందని చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మెగా డీఎస్సీని ప్రకటించటం, పెంచిన పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. విజయనగరం విచ్చేసిన మంత్రి శ్రీనివాస్‌ను జడ్పీ అతిథి గృహంలో కూటమి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కలుసుకుని అభినందనలు తెలియచేశారు.
పలు సమస్యలపై ప్రజలు మంత్రికి వినతులు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ గత ఎన్నికల హామీల్లో ఇచ్చిన మెగా డీఎస్సీని గాలికొదిలేసిందన్నారు. ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. చివరిలో ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ ఇచ్చి వైఎస్సార్సీపీ ప్రభుత్వం హడావుడి చేసిందన్నారు. అయితే ప్రస్తుతం అధికారం చేపట్టిన వెంటనే కూటమి ప్రభుత్వం 16,347పోస్టులతో డీఎస్సీ ప్రకటించిందని గుర్తు చేశారు.
సోమవారం నిర్వహించిన తొలి మంత్రిమండలి సమావేశంలో మెగా డీఎస్సీ ఫైల్‌కు ఆమోదం లభించినట్లు తెలిపారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణ, ఫలితాలు తదితర పూర్తి వివరాలను సంబంధిత శాఖాధికారులు తర్వలో వెల్లడిస్తారని అన్నారు. దీంతోపాటు సామాజిక పింఛన్ల పెంపుపైనా కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని, జులై 1న 4,400 కోట్ల రూపాయలతో పెంచిన పింఛన్ పంపిణీ చేస్తున్నామన్నారు.
అదేవిధంగా స్కిల్ సెన్సెక్స్‌తో రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి కొండపల్లి తెలియచేశారు. దీని ద్వారా పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని అంశాలపై శ్వేతపత్రం విడుదలకు కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా మేలు చేసేందుకు, కేంద్రం నుంచి తగిన సహాయ, సహకారాలు పొందేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
"వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టూ భర్తీ చేయలేదు. చివరిలో నోటిఫికేషన్ ఇచ్చి హడావుడి చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం అధికారం చేపట్టిన వెంటనే డీఎస్సీ ప్రకటించింది. డీఎస్సీ పరీక్ష వివరాలను అధికారులు కొన్ని రోజుల్లో వెల్లడిస్తారు. కొన్ని అంశాలపై శ్వేతపత్రం విడుదలకు కసరత్తు చేస్తున్నాం." - కొండపల్లి శ్రీనివాస్, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి