Minister Jupalli fires on KCR : 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కి అధికారం పోయాక మతిభ్రమించినట్లుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli) ఎద్దేవా చేశారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే అయిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే వానకాలం అయిపోయిందని మంత్రి పేర్కొన్నారు.
ఆత్మసాక్షి ఉంటే రాజీనామా చేయాలి - హరీశ్‌రావుకు జూపల్లి సవాల్
బీఆర్ఎస్(BRS) నేతలు రాజకీయ లబ్ధికోసమే, కరవు పేరుతో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. కృష్ణానది జలాల్లో రాష్ట్రవాటాను కాపాడలేకపోయారని, జలాలపై హక్కు సాధించకపోగా రాయలసీమకు తరలించుకుపోతుంటే ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో నీటిని నిలుపుకోలేకపోయామని ఆవేదన చెందారు.
cong Nagarkurnool Parliament meet : కల్వకుర్తి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం సంబంధించి కూడా 2021-22వ సంవత్సరంలో కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ, రైతుల పంటలకు కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు వదలలేదని మంత్రి మండిపడ్డారు. వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్, రైతుల దగ్గరికి వెళ్లి గిట్టుబాటు ధర అడగడం హాస్యాస్పదం అన్నారు. కేసీఆర్(KCR) ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించి ఏరోజు ప్రగతి భవన్ దాటి బయటికి రాలేదని, ప్రజల్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
కానీ ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడానికి మాత్రమే, రైతు పర్యటన చేస్తున్నారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. గడిచిన పది సంవత్సరాల కాలంలో అకాల వర్షాల వల్ల, కరవు పరిస్థితుల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చినట్లు నిరూపించనట్లయితే, తాను ఏ శిక్షకైనా సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. కేవలం 2023లో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చినట్లు తెలిపారు.
2023 ఇవ్వడానికి కారణం కేవలం జనాల ఓట్ల కోసం మాత్రమేనని రైతులపై ఎలాంటి ప్రేమ లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కుర్చకుల దామోదర్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్మెన్ సరిత, జిల్లా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఏఐసీసీ మెంబర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
"బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధికోసమే, కరవు పేరుతో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారు. వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్, రైతుల దగ్గరికి వెళ్లి గిట్టుబాటు ధర అడగడం హాస్యాస్పదంగా ఉంది. అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడానికి మాత్రమే, రైతు పర్యటన చేస్తున్నారు". - జూపల్లి, మంత్రి