Minister Dola Bala Veeranjaneya Swamy on Volunteers : వాలంటీర్లను తీసేస్తామని తాము చెప్పలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సచివాలయం మూడో బ్లాక్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. సింగరాయకొండలో బైపీపీలో 40, ఎంపీసీలో 40 సీట్లను గత ప్రభుత్వం రద్దు చేయగా, వాటిని పునరుద్ధరిస్తూ ఆయన తొలి సంతకం చేశారు.
Minister Dola Took Charge as Minister : అదేవిధంగా పర్చూరు నియోజకవర్గం, నాగులుపాలెం గురుకుల పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టు కింద రూ.15 లక్షలతో సోలార్ ప్రాజెక్టును, వేడినీటి కోసం మంజూరు చేశామని డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అక్కడే పాఠశాలలకు అందించే పండ్లు, కూరగాయలు, గుడ్లు నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.9 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
గత ప్రభుత్వ బకాయిలను మేము చెల్లించాల్సి వస్తోంది : మరోవైపు 2014-2019 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. కానీ జగన్ సర్కార్ ఆ సీట్లను రద్దు చేసిందని మండిపడ్డారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి రూ.2505.56 కోట్లు, ఎస్సీ విద్యార్థులకు రూ.131.82 కోట్లు బకాయిలు పెట్టిందని విమర్శించారు. వాటిని ఇప్పడు తాము చెల్లించాల్సి వస్తోందని, లేకపోతే విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి ఉందని డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
"గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద నోడల్ ఏజెన్సీగా సోషల్ వెల్పేర్ డిపార్ట్మెంట్ ఉండేది. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి రూ.199 కోట్లు బకాయిలు ఉన్నాయి. అంబేద్కర్ విదేశీ విద్య పథకం కింద రూ.5.69 కోట్ల బకాయిలు ఉంచారు. బెస్ట్ ఎవెయిలబుల్ స్కూల్‌ను గత ప్రభుత్వం రద్దుచేసి రూ.60.10 కోట్లు బకాయిలు పెట్టింది. అన్ని పథకాలకూ సంబంధించి బకాయిలు రూ.3573 కోట్ల పైనే ఉంది. ఇప్పడు ఆ భారం మొత్తం తమ ప్రభుత్వంపై పడింది." - డోలా బాల వీరాజనేయస్వామి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో జీతభత్యాలు, కాస్మోటిక్ ఛార్జీలు తదితర బిల్లులన్ని కలిపి రూ.243.34 కోట్ల బకాయిలు ఉన్నాయని డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఈ క్రమంలోనే వాలంటీర్లను తీసేస్తామని తాము చెప్పలేదని వెల్లడించారు. మరోవైపు ఇచ్చిన హామీ ప్రకారం జులై 1న మూడు నెలల బకాయిలు కలిపి రూ.7,000లు పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటిని సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తామని డోలా బాల వీరాంజనేయస్వామి చెప్పారు.
సాంఘిక సంక్షేమ శాఖను సంక్షోభంలోకి నెట్టేశారు : మంత్రి డోలా - Dola Veeranjaneya Swamy press meet