Mid Day Meal Workers Protest To Fulfill Demands: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఉద్యమ బాట పట్టారు. పాదయాత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఇచ్చిన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కనీస వేతనంతో పాటు ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్లు కల్పించాలని కోరారు. న్యాయమైన 11 డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.
Vizag: వేతనాలు పెంచాలంటూ విశాఖలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళన చేపట్టారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పది వేల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టాక హామీని తుంగలో తోక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని నినాదాలు చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్‌లో నిరసన చేపట్టారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా తమకు జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం చెల్లిస్తున్న 3 వేల రూపాయలతో భోజనాలు వండటం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వంట గదిలో ప్రమాదాలకు గురైన సరే తమకు కనీసం ఆరోగ్య బీమా కూడా లేకపోవడం శోచనీయమన్నారు.
పెండింగ్ బిల్లులు, వేతనాల కోసం మధ్యాహ్న భోజన నిర్వాహకుల ధర్నా
Vijayawada: రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లు విలీనం చేయడం వల్ల ఉపాధి కోల్పోతున్న మధ్యాహ్నం భోజన పథకం కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని విజయవాడ ధర్నా చౌక్‌లో కార్మికులు ధర్నా చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీ 20 రూపాయలు ఇవ్వాలన్నారు. కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు, బిల్లులు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
Vizianagaram: ఏపీ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ అధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు నిరసనకు దిగారు. జగనన్న గోరుముద్ద అని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప దానికోసం మీరు ఇస్తున్న మెనూ చార్జీలు ఎంత అని కార్మికులు ప్రశ్నించారు. చిన్న పిల్లలకి రూ. 5, హైస్కూల్ విద్యార్థులకు రూ.8 ఇస్తున్నారని, ఇది ఎక్కడ సరిపోతుందని మెనూ ఛార్జ్ రూ.20 పెంచాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకులను పౌర సరఫరా ద్వారా అందిస్తేనే పిల్లలకు వండి పెట్టగలమని తెలిపారు. వంటమ్మలు తమ పుస్తుల తాడును తాకట్టు పెట్టి పిల్లలకు వండుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. తమను ప్రైవేట్ సంస్థకి అప్పగించకుండా, గుర్తింపు కార్డులను అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేసి పథకం అమలుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్ల ను పరిష్కరించకపోతే విజయవాడ చేరుకొని తాడేపల్లిను ముట్టడిస్తామని కార్మికులు హెచ్చరించారు.
కోనసీమ: ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మధ్యాహ్న భోజన పథక కార్మికులు కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు నిరసన చేపట్టారు.
'రాజకీయ వేధింపులు ఆపండి... మధ్యాహ్న భోజన బకాయిలు చెల్లించండి'
Bapatla, Ongole: ఒంగోల్లో మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాపట్ల జిల్లా కలెక్టరేట్లో అర్జీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని మంచి లక్ష్యంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని కార్మికులు పేర్కొన్నారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించిన ఇటువంటి ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యాలకు విరుద్ధంగా ఈ పథకాన్ని నీరు కారుస్తున్నాయి అని కార్మికులు మండిపడ్డారు.