Mid Day Meal Scheme in Govt Junior Colleges: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మళ్లీ మధ్యాహ్న భోజన పథకం అమలుకు రంగం సిద్ధమైంది. పథకం పునరుద్ధణకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు వారికి పోషకాహారం అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఎక్కువ మంది దూరప్రాంతాల నుంచి వచ్చేవారే:
- ఉమ్మడి కృష్ణా జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా 4,911 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది పొరుగు గ్రామాల నుంచి వస్తున్నవారే.
- ఉదాహరణకు కంచికచర్ల మండలంలోని ఎస్.అమరవరం, పెండ్యాల, మోగులూరు నుంచి సుమారు 25 మంది విద్యార్థులు కంచికచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. వారు రోజూ 15 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వస్తారు. ఇంట్లో వీలుకాక లేదా క్యారేజీ మర్చిపోతే ఆ రోజంతా పస్తు ఉండాల్సిందే.
- ఉయ్యూరు మండలం ఆకునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఉంగుటూరు మండలం నుంచి 12 మంది విద్యార్థులు వస్తున్నారు. రోజూ ఉదయం 8 గంటలకు బయలుదేరి 18 కిలోమీటర్లు ప్రయాణించి కాలేజీకి చేరుకుంటారు. కొన్నిసార్లు ఇంట్లో వీలు కుదరకపోవడం, వెంట తెచ్చుకున్న క్యారేజీ మధ్యాహ్నానికి పాడవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
"పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం" - డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్
అర్ధాకలితో విద్యార్థులు విద్యాభ్యాసం: ఇలా ఒకటి, రెండు ప్రాంతాలు కాదు రాష్ట్రం మొత్తం మీద వివిధ జూనియర్ కళాశాలల్లో ఈ సమస్య ఉంది. విద్యార్థులు ఉదయాన్నే బయలుదేరడం వల్ల కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు వేరే పనులకు వెళ్లడం వల్ల సకాలంలో క్యారియర్ కట్టలేకపోతున్నారు. పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థులది మరో సమస్య. వీరందరికి మధ్యాహ్న భోజనం అవసరం ఉంది. టీడీపీ ప్రభుత్వం 2019 వరకు అమలు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని జగన్ సర్కార్ పక్కన పెట్టేసింది.
అర్ధాకలితో విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రభుత్వ జానియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు, పౌష్టికాహారలోపం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు సేకరిసంచే పనిలో అధికారులు: తాజాగా ప్రభుత్వం కళాశాలల పనివేళల్ని సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పెంచింది. ఈ లెక్కన మధ్యాహ్న భోజన పథకం ఉంటేనే పిల్లలకు ఉపయోగకరం. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజన వసతి కల్పించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల సంఖ్య, వంట పాత్రలు, షెడ్లు, నిర్వాహకులు, సరకుల పంపిణీ తదితర వివరాలు సేకరిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం వృత్తి విద్య కోర్సుల్లో వేలాదిమంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 80 శాతానికి పైగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారే. కాలేజీ దూరం కావడంతో ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి బయలు దేరుతున్నారు. వీరు మధ్యాహ్నం టిఫిన్, భోజనం చేస్తే అదనంగా ఖర్చవుతుందని పస్తులుంటున్నారు. ఇలాంటి వారందరికి మధ్యాహ్న భోజనం వరమని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.
'పరిశీలన తర్వాత సందేహాలు పెరిగాయ్' - విశాఖ డెయిరీపై ఆడిట్ జరగాల్సిందే : ప్రత్యేక హౌస్ కమిటీ
పైసలిస్తేనే రిజిస్ట్రేషన్ - రైతులను పీల్చి పిప్పి చేస్తున్న సీఆర్డీఏ ఉద్యోగులు