Gaddam Meghana Yuva Story : బాల్యంలో ఆదివాసీల సమస్యలను ప్రత్యక్షంగా చూసింది ఈ యువతి. నిరక్ష్యరాస్యత సహా కనీస అవసరాలు లేక వారు పడుతున్న ఇబ్బందులు ఈ యువతి మనసును కలచి వేశాయి. అప్పుడే వారి హక్కుల కోసం పోరాడాలని సంకల్పించింది. అందుకు న్యాయవృత్తి సరైన మార్గమని నమ్మింది. నిత్యం కష్టపడి న్యాయవిద్య పూర్తి చేసింది. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన పరీక్షల్లో న్యాయమూర్తిగా ఎంపికై హైకోర్టు న్యాయమూర్తి చేత ప్రశంసలు అందుకుంది.
ఈ యువతి పేరు గడ్డం మేఘన. మంచిర్యాల జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన దేవాపూర్ గ్రామంలో జన్మించింది. తల్లిదండ్రులు పురుషోత్తం, మాలతిలత. వీరికి మేఘన ఒక్కరే కుమార్తె కావడంతో ఉన్నత చదువులు చదివించాలని నిర్ణయించుకున్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇరుగు పొరుగు వారు అడపిల్లకి చదువు ఎందుకని అన్నారు. కానీ, వీరు అవేమీ లెక్కచేయలేదు. కుమార్తె భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒక్కటే మార్గమని కష్టపడి చదివించారు.
తల్లిదండ్రులను ఇరుగు పొరుగు వారు అంటున్న సూటి పోటి మాటలను చెవులారా విన్నది మేఘన. వాటన్నింటికీ చదువుతోనే సమాధానం చెప్పాలనుకుంది. అహర్నిశలు కష్టపడి పదో తరగతిలో 9.8 జీపీఏతో ఔరా అనిపించింది. అదే పట్టుదలతో ఇంటర్లో కూడా 96 శాతం మార్కులు సాధించింది. అనంతరం కరీంనగర్లోని ఆల్ ఫోర్స్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసినట్లు మేఘన చెబుతోంది.
YOUNG LADY SELECTED AS JUDGE : డిగ్రీ పూర్తైన తర్వాత కుటుంబ సభ్యుల సలహాతో న్యాయవృత్తి చేయాలనుకుంది మేఘన. ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షల్లో 84వ ర్యాంకుతో ఉస్మానియా యూనివర్సిటీలో సీటు సంపాదించింది. న్యాయవృత్తిలో ఎదగడమే లక్ష్యంగా కష్టపడి చదివి రెండు బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో నిర్వహించిన లాసెట్‌లో 3వ ర్యాంకు సాధించి ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశం పొందానని మేఘన చెబుతోంది.
ఎల్ఎల్ఎం చేస్తూనే ఇటీవల హైకోర్టు స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్వహించిన జూనియర్స్ సివిల్ జడ్జి పరీక్షలో సత్తా చాటింది మేఘన. తుది ఇంటర్య్వూలో ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణలో మొదటి స్థానం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్స్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. ఈమె ప్రతిభను గుర్తించిన హైకోర్టు, పురస్కారాన్ని అందించింది.
పాఠశాలకు వెళ్తున్న సమయంలోనే ఆదివాసీలు అణచివేతకు గురవుతుడటం చూసింది మేఘన. అలాంటి వారికి న్యాయం అందించాలనే సంకల్పంతో న్యాయవృత్తి వైపు వడివడిగా అడుగులు వేసింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో తల్లిదండ్రులు ఎంతగనో ప్రోత్సాహించారని అంటోంది. గిరిజనులకు, పేదలకు న్యాయం అందేలా కృషి చేస్తానని చెబుతోంది ఈ యవ జడ్జి.
జూనియర్ సివిల్ జడ్జి బాధ్యతలు : తొలి ప్రయత్నంలోనే మేఘన జూనియర్స్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడం పట్ల ఆమె తల్లిదండ్రులు అనందం వ్యక్తం చేస్తున్నారు. తన ఆశయ సాధన కోసం ఆమె రోజుకు సమారు 14 గంటలు చదివేదని అంటున్నారు. తాము కన్న కలలను సాకారం చేసిన మేఘనను చూస్తే ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నారు.
తెలంగాణలోనే జూనియర్ సివిల్ జడ్జి బాధ్యతలు చేపడతానని అంటోంది మేఘన. బలమైన సంకల్పంతో ముందుకెళితే విజయం దానంతట అదే వరిస్తుందని అంటోంది. అడపిల్లకు చదువేందుకుని విమర్శించిన నోళ్లతోనే ప్రశంసలందుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ యువ మహిళా న్యాయమూర్తి.
ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - విజయ రహస్యం అదేనట - Man Got Three Government Jobs