Medicine Shortage in Government Hospitals : రాష్ట్రంలోని సర్కారు దవాఖానాల్లో చికిత్స కోసం వచ్చే నిరుపేద రోగులకు మందుల కొనుగోలు పెను భారంగా మారుతోంది. ట్రీట్మెంట్ వరకు ఉచితంగానే అందుతున్నా, ఔషధాలు మాత్రం పూర్తి స్థాయిలో దొరకడం లేదని బాధితులు వాపోతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. డాక్టర్లు రోగులకు ఐదారు రకాల మందులు రాస్తే, అందులో కేవలం ఒకటి లేదా రెండు రకాలకు మించి దొరకడం లేదు. నగరంలో ప్రధాన ఆసుపత్రులైన గాంధీ హాస్పిటల్, ఉస్మానియాల్లోనూ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. మందుల కోసం ప్రతి రోగి కనీసం రూ.200 నుంచి రూ.300 వరకు బయట వెచ్చించాల్సిందే.
రోగులకు తగ్గట్లు లేని సరఫరా : సాధారణంగా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో అధికారిక పడకలు, నిత్యం వచ్చే రోగులను పరిగణలోకి తీసుకుని టీజీఎంఎస్ఐడీసీ మందులను సరఫరా చేస్తోంది. 80 శాతం మందులు ఇక్కడి నుంచే రాగా, మరో 20 శాతం మందులను అత్యవసర పద్ధతిలో ఆసుపత్రి అధికారులు కొనుగోలు చేస్తుంటారు. అయితే అధికారిక లెక్కల కంటే రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో రోగులందరికీ మందులు సరఫరా చేయలేకపోతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో పడకలు 1,100 వరకు ఉండగా, నిత్యం 1,500 మందికి పైగానే రోగులు వస్తున్నారు. ఇక గాంధీ హాస్పిటల్లో 1000 పడకలకు గానూ 1,500 పైనే రోగుల తాకిడి ఉంటోంది. సీజన్‌లో ఈ రెండు ఆసుపత్రుల్లో ఈ సంఖ్య 2 వేలకు పైగానే పెరుగుతోంది. ఆ స్థాయిలో అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండటం లేదు.
ప్రైవేటుతో లోపాయికారిగా : కొన్ని విభాగాల్లో వైద్యులు ప్రైవేటు దుకాణదారులతో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకొని బయటకు మందులు రాస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటిపై నిఘా పెట్టి గతంలో ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా కొందరి తీరు మారడం లేదు. ప్రభుత్వం అందించే మందులను పక్కనపెట్టి, ప్రైవేటులో దొరికే ఇతర బ్రాండు మందులు రాస్తున్నారనే విమర్శలున్నాయి. ఫలితంగా పేద రోగులు డబ్బులు పెట్టి ప్రైవేటులో కొంటున్నారు. గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రులకు వచ్చే పేదలు బయట మందులు కొనలేక, డాక్టర్ నెల రోజులకు రాస్తే వారం, 10 రోజులకు మాత్రమే తీసుకుంటున్నారు. తర్వాత వాడటం మానేస్తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోగులకు అన్ని రకాల మందులు ఉచితంగా అందేలా చొరవ తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
ఆగకుండా దగ్గు వస్తోందా? మందులు వాడినా తగ్గట్లేదా? అయితే గుండె వైఫల్యం కావచ్చు!!