Markfed Funds Misused in Andhra Pradesh Under YSRCP Rule : గత ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ సంస్థలనూ వదల్లేదు. సీఎం యాప్, మార్కప్ పేరుతో మార్క్‌ఫెడ్‌ను ముంచేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు తనఖాపెట్టి ఆగ్రోస్ ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టింది. ఏపీ ఆగ్రోస్‌కు చెందిన విలువైన స్థలాలనూ గత ప్రభుత్వం సొంత పార్టీ నేతలకు కట్టబెట్టింది. ఇలాంటి అక్రమాలెన్నో ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. వీటిపై విచారణ చేయిస్తే పాపాల భైరవుల బాగోతం బయటకొస్తుందని వ్యవసాయశాఖలోని అధికారులే చెబుతున్నారు.
మార్కప్ పేరుతో రూ.10కోట్లకుపైగా దుర్వినియోగం : మార్కెట్లో పంట ఉత్పత్తులకు ధరలు తగ్గినప్పుడు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రైతుల నుంచి మద్దతు ధరకు ఆ ఉత్పత్తులు కొనుగోలు చేసి వాటిని నిల్వ చేస్తారు. ధర పలికినప్పుడు విక్రయిస్తారు. ఇందుకు గత ప్రభుత్వం ‘మార్కప్’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. దీంతో నిత్యావసరాలు కొని, ప్యాకింగ్ చేయించి విక్రయించాలని చూసింది. ఇందుకు పెద్దపెద్ద హోటళ్లలో సమావేశాలు పెట్టి, గొప్పగా ప్రచారం చేసింది. ఆ మేరకు జిల్లా, డివిజన్, మండలాల స్థాయిలో స్టాకిస్టులను పెట్టింది. అరువు పద్ధతిలో నిత్యావసరాలు సరఫరా చేసింది. మొత్తమ్మీద రూ.11 కోట్లతో ‘మార్కప్’ వ్యాపారం పెట్టిస్తే అది కాస్త పడకేసింది. రూ.50 లక్షలు తప్ప మిగతా డబ్బు ఇప్పటికీ వసూలు కావడం లేదు. ఇలా కొందరు అధికారుల అత్యుత్సాహం మార్క్‌ఫెడ్‌ను నష్టాల్లోకి నెట్టింది.
ఆగ్రోస్ మనుగడే ప్రశ్నార్థకం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ చర్యలతో ఏపీ ఆగ్రోస్, అందులోని ఉద్యోగుల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సంస్థకు రూ.100 కోట్లకు పైగా నిధులు సమకూరాయి. వైఎస్సార్సీపీ వచ్చాక వాటిని కరిగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో పని చేసిన ఛైర్మన్, అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు.
CBI CASE ON SPY AGRO: నంద్యాల ఎస్పీవై ఆగ్రో కర్మాగారంపై సీబీఐ కేసు నమోదు
టెండర్లు పిలవకుండా ఎంపిక చేసిన సంస్థల నుంచి అధికారులు రూ.13 కోట్ల విలువైన పిచికారీ యంత్రాలు, టార్పాలిన్లు కొనుగోలు చేశారు. అవి నాసిరకంగా ఉండటంతో ఆగ్రోస్ సేవాకేంద్రాల నిర్వాహకులు తిరస్కరించారు. అంతకుముందు రూ.42 లక్షలతో కొనుగోలు చేసిన రేపర్లు మార్కెట్ యార్డుల్లో మూలకు చేరాయి.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రైతులకు పరికరాల సరఫరా, పంచాయతీరాజ్ సంస్థకు ట్రాక్టర్ల కొనుగోలు పేరుతో పెద్దఎత్తున యంత్రాంగం నడిపించారు. ట్రాక్టర్ల సరఫరా పేరుతో సంస్థ నిధుల నుంచి రూ.41.85 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను హామీగా పెట్టి రూ.33.36 కోట్ల రుణం తీసుకున్నారు.
రాష్ట్రంలో ఆగ్రోస్‌కు ఉన్న విలువైన స్థలాల్ని దొడ్డిదారిన వైఎస్సార్సీపీ నేతలకు లీజు పేరుతో కట్టబెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అనంతపురం సహా పలుచోట్ల రూ.కోట్ల విలువైన స్థలాల్లో నిర్మాణాలు చేస్తున్నారు.
ఒక్క యాప్‌నకు రూ.3 కోట్లా! : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సమీక్ష జరిగితే చాలు ‘సీఎం యాప్’ అంటూ గొప్పగా చెప్పేవారు. నిజానికి దాంతో రైతుకు ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వశాఖలూ ప్రయోజనం పొందలేదు. కానీ, ఈ యాప్ తయారీ, నిర్వహణ పేరుతో రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇంతకంటే దోపిడీ మరోటి ఉంటుందా? అని వ్యవసాయశాఖలోని అధికారులే నివ్వెరపోతున్నారు. ఈ యాప్‌తో దేశ, విదేశీ వేదికలపై రాష్ట్ర రైతులు ఉత్పత్తులు అమ్ముకోవచ్చని గొప్పగా చెప్పారు. నిజానికి గత ఐదేళ్లూ పంట ఉత్పత్తులకు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక యాప్ తయారు చేసి నిర్వహించాలంటే రూ.10లక్షలు, లేదంటే రూ.15లక్షలే ఎక్కువని నిపుణులు అంటున్నారు. అలాంటిది దీనికోసం రూ.కోట్లు చెల్లించడం ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతోంది.
వైఎస్సార్సీపీ 'స్మార్ట్' అక్రమాలపై ఆడిట్ - అడ్డగోలు చెల్లింపులపై ఆరా - YSRCP Smart Meters Scam