Many people Paid their Tribute to Lawyer Sunkara Rajendra Prasad Wife : విద్యార్ధి దశ నుంచే ఉద్యమాలు చేసింది. మహిళల హక్కుల కోసం పోరాడింది. సారా వ్యతిరేక ఉద్యమంలో ముందు నడిపించింది. తన జీవన ప్రయాణంలో చేస్తూ రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జ్యోత్న్స అస్తమించింది. ఆమె మరణంతో మహిళా లోకం కన్నీటి సంద్రంలో మునిగింది. జ్యోత్న్స భౌతికకాయానికి వామపక్ష నేతలు, న్యాయవాదులు, ప్రముఖులు నివాళులర్పించారు. భౌతికకాయాన్ని ఎన్నారై ఆసుపత్రికి దానం చేశారు.
స్త్రీల సమానత్వం కోసం సమాజాన్ని నిలదీశే గొంతు నేడు మూగబోయింది. మహిళా హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న జ్యోత్న్స మరణంతో నగరంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రజాసంఘాల నేతలు, న్యాయవాదులు, మేథావులు, వామపక్ష నేతలు ఆమె మృతికి కన్నీటి నివాళులర్పించారు. నింగికెగసిన ధృవతార జ్యోత్స్నకు రెడ్ శాల్యూట్ చేసి అంతిమయాత్ర నిర్వహించారు.
బతికి ఉన్నప్పుడే కాదు మరణించినా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఆమె నిర్ణయం ప్రకారం భౌతికకాయాన్ని మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి దానం చేశారు. సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులతో వెళ్లిన రాజస్థాన్ విహారయాత్ర విషాదంగా మారింది. ఈనెల 8న అర్ధరాత్రి దాటాకా అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యాయవాది రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మరణించగా మరో 11 మంది గాయపడ్డారు. భౌతికకాయాన్ని ఈనెల 9న విజయవాడలోని ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు.
సీపీఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎంఏ బేబి, సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువురు నేతలు, ప్రముఖులు జ్యోత్స్న భౌతికకాయానికి నివాళులర్పించారు. న్యాయవాద సంఘాలు ఆమె మృతికి నివాళులర్పించారు. భౌతికకాయాన్ని సీతారాంపురంలోని ఆమె స్వగృహం నుంచి మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులకు భౌతికకాయాన్ని అప్పగించారు.
కృష్ణాజిల్లాకు చెందిన జ్యోత్స్న చిన్నప్పటి నుంచి ప్రజాసమస్యలపై పోరాటం చేశారు. విద్యార్ధి దశలో ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘంలో నాయకురాలిగా పని చేశారు. అనంతరం ఉమ్మడి కృష్ణాజిల్లాలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఐద్వాలో సభ్యురాలిగా కొనసాగుతూ మహిళల హక్కులపై పోరాటం చేశారు. బాలోత్సవ భవన్ ఏర్పాటులో జ్యోత్స్న తన వంతు కృషి చేశారు. దానికి కార్యదర్శిగా పని చేశారు. తరుణితరంగాలు, సేఫ్ అనే స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేసి లింగవివక్షపై అనుక్షణం పోరాటం చేశారని ఆమె మిత్రులు స్వరూపారాణి తెలిపారు. రాజస్థాన్ యాత్రలో ఉన్నా ఫోన్ ద్వారా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకుని పలు సూచనలు చేశారని స్వరూపారాణి అన్నారు. నిత్యం సమాజ హితం కోరే ఓ ఉద్యమ కుసుమం నేల రాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు - జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లే
దేవరగట్టులో కర్రల సమరం - సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పటిష్ఠ నిఘా : ఎస్పీ బిందు మాధవ్