Many Leopards Nagarjuna Sagar Srisailam Tiger Reserve : క్రూర జంతువుల్లో పెద్దపులి తర్వాతి స్థానం చిరుత పులిదే. అటువంటి చిరుతలు అధికంగా ఉన్న ప్రాంతంగా నాగార్జున సాగర్ - శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం (ఎన్‌ఎస్‌టీఆర్) నిలిచింది. ఈ పరిధిలో మొత్తం 270 చిరుతలు ఉన్నాయని మరో 90 ఈ పరిధిలో సంచరిస్తున్నాయని కేంద్ర గణాంకాలశాఖ ఎన్విస్టాట్స్-2024 ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దేశంలో ఉన్న 55 పులుల సంరక్షణ కేంద్రాల్లో ఇక్కడే అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సింహాలు, పెద్ద పులులు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జీవనం సాగిస్తాయి. చిరుతలు అలా కాదు. అన్ని చోట్లా మనుగడ సాగించగలవు. ఈ కారణంగానే మైదాన ప్రాంతాల్లోనూ అవి సంచరిస్తుంటాయి.
కుడి 'కన్ను' అలా - ఎడమ 'ఐ' ఇలా - వెరైటీ ఆడ చిరుతను చూశారా? - Unique Leopard
ఫలిస్తున్న సంరక్షణ చర్యలు : జీవ వైవిధ్యానికి పుట్టినిల్లు నల్లమల. పెద్ద పులుల ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎన్‌ఎస్‌టీఆర్ ఏర్పాటు చేసింది. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా అందులో 1,401 చదరపు కిలోమీటర్ల పరిధిలో పులుల అభయారణ్యం ఉంది. ఇందులో ఎనభైకి పైగా పెద్ద పులులు ఉన్నాయి. వీటి సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. స్మగ్లర్ల బారినపడకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వేసవిలో వాటి దాహార్తి తీర్చేందుకు సాసర్ పిట్ల ఏర్పాటు, అగ్ని ప్రమాదాల బారిన పడకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ అంశాలు చిరుతపులుల సంఖ్య పెరిగేందుకూ దోహదం పడింది.
శునకంలా అరుస్తున్న జింక- కెమెరాకు చిక్కిన అరుదైన వన్యప్రాణి
గణన ప్రత్యేకం : పెద్ద పులులు, చిరుతల గణనను పలు రకాలుగా చేపడతారు. వాటి పాద ముద్రలను సేకరించడం ఓ పద్ధతి. దీర్ఘచతురస్రంగా ఉంటే ఆడ, చతురస్రంగా ఉంటే మగ పులిగా గుర్తిస్తారు. పెద్ద పులి పాదం 14 నుంచి 15 సెం.మీ.లు ఉంటే చిరుతది 7 నుంచి 8 సెం.మీ.గా ఉంటుంది. అవి సంచరించే ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు ద్వారానూ గుర్తిస్తారు. ఏ రెండు పులులకు ఒకేలా చారలు, మచ్చలు ఉండవు. వాటిని బట్టి కూడా సంఖ్యను లెక్కిస్తారు.